Andhra Lady Don: నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ అరాచకాల కథ చివరికి కటకటాల వెనక్కి చేరింది. వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా కెరీర్ మొదలుపెట్టి, రెండేళ్లలోనే పెద్ద స్థాయిలో మోసాలు చేస్తూ హైప్రొఫైల్ లేడీ డాన్‌గా మారింది. రౌడీషీటర్ శ్రీకాంత్‌ను భర్తగా చెప్పుకుంటూ ఆయన పెరోల్ కోసం పోలీస్, పొలిటికల్ వ్యవస్థలపై లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బిల్డర్ ఫిర్యాదుతో అరెస్టు
Andhra Lady Don: అపార్ట్మెంట్ యజమాని ఫ్లాట్‌పై బెదిరింపులకు పాల్పడిన కేసులో అరుణ బుక్కైంది. రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన ఆమె, మిగిలిన డబ్బు ఇవ్వకుండా యజమానిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో మెడపై కత్తి పెట్టి ఫ్లాట్ తన పేరుమీద రిజిస్టర్ చేయాలని బలవంతం చేసిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు అరుణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు.
కార్ డిక్కీలో దాక్కుని పారిపోవాలనుకున్నా..
అరెస్ట్‌కు భయపడి అరుణ కారు డిక్కీలో దాక్కుని పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే కోవూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ అనంతరం జైలుకు తరలించారు.
శ్రీకాంత్ పెరోల్ లాబీయింగ్‌పై ఆరోపణలు
గత వారం నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్ కు పెరోల్ లభించింది. దీనికోసం నిడిగుంట అరుణ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆసుపత్రిలో ఉన్న శ్రీకాంత్‌ను అరుణ కలిసిన వీడియోలు బయటకు రావడంతో మరింత వివాదం చెలరేగింది.
రాజకీయ రంగు పులుముకున్న కేసు
ఈ కేసు రాజకీయ రంగు కూడా ఎత్తుకుంది. అరుణ టీడీపీ కార్యకర్తేనని వైసీపీ వాదిస్తుండగా, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాత్రం ఆమెకు వైసీపీ నేతలతోనే సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వాదోపవాదాలకు దారితీస్తోంది.
