New Virus: గుంటూరులో కొత్త రకం బ్యాక్టీరియా వ్యాధి విజృంభిస్తోంది. వైద్యులు హెచ్చరిస్తూ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మెలియాయిడోసిస్ అనే ఈ వ్యాధి బర్కోల్డేరియా సుడోమాలీ బ్యాక్టీరియా వల్ల వస్తోంది. దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో ఇది ప్రాణాంతక స్థితికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
New Virus: గుంటూరులోని శ్రీ ఆసుపత్రి డాక్టర్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ, ఇది సాధారణ ఫీవర్లా కనిపించినా, ఆలస్యంగా గుర్తిస్తే ప్రమాదకరమవుతుందని తెలిపారు. తురకపాలెంకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి 45 రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి కల్చర్ పరీక్షల తర్వాత మెలియాయిడోసిస్ బారిన పడ్డాడని తేలిందన్నారు. అయితే యాంటీ బయాటిక్స్ వాడిన తర్వాత అతను కోలుకున్నాడని చెప్పారు.
ఇదే విధంగా ఇబ్రహీం అనే మరో రోగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ఆసుపత్రి చేరగా, సీటీ స్కాన్, బ్లడ్ కల్చర్ పరీక్షల ద్వారా మెలియాయిడోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. సకాలంలో గుర్తించి చికిత్స చేయడం వల్లే రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు వివరించారు.
వైద్యుల ప్రకారం వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. నేలలో ఉండే తేమ కారణంగా ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, చెప్పులు లేకుండా తిరిగే వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. సాధారణంగా డెంగీ, మలేరియా లాంటి జ్వరాల్లా అనిపించినా, కల్చర్ పరీక్షలతో మాత్రమే ఈ వ్యాధి బయటపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, దీర్ఘకాలిక జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
