Bone Glue: నిమిషాల్లో ఎముకలు జాయింట్ అయ్యే అద్భుతం..‘బోన్ గ్లూ’ సంచలనం!

Bone Glue: ఆధునిక వైద్య శాస్త్రం రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, మానవాళికి కొత్త ఆశలను పంచుతోంది. తాజాగా చైనా శాస్త్రవేత్తలు పగుళ్లు, విరిగిన ఎముకలను కేవలం మూడు నిమిషాల్లో సరిచేసే ‘బోన్ గ్లూ’ (Bone Glue) ను అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Bone Glue: ఈ విప్లవాత్మక ఆవిష్కరణను తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 10న ఆవిష్కరించారు. “బోన్-02” అనే పేరుతో విడుదల చేసిన ఈ గ్లూ, పగుళ్లు వచ్చిన ఎముక ముక్కలను కేవలం 3 నిమిషాల్లో అతికించగలదని పరిశోధకులు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన సర్ రన్ రన్ షా హాస్పిటల్‌ అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ లిన్ జియాన్‌ఫెంగ్ మాట్లాడుతూ – “నీటి అడుగున వంతెనకు గట్టిగా అతుక్కునే గుల్లలను గమనించిన తర్వాతే బోన్ గ్లూ తయారీ ఆలోచన వచ్చింది” అని చెప్పారు.

ఇది కూడా చదవండి: G7 Summit: చైనా, భారత్‌పై సుంకాలు విధించండి! జీ7 దేశాలకు అమెరికా పిలుపు

రక్తం అధికంగా ఉండే వాతావరణంలో కూడా, ఈ గ్లూ 2-3 నిమిషాల్లో ఖచ్చితమైన స్థిరీకరణను కల్పించగలదని లిన్ తెలిపారు. అంతేకాదు, ఎముకలు నయం అయిన తర్వాత ఈ గ్లూ సహజంగానే శరీరంలో కలిసిపోతుంది. దాంతో ఇంప్లాంట్లు తీసివేయడానికి అదనపు శస్త్రచికిత్స అవసరం ఉండదని వెల్లడించారు.

ప్రస్తుతం ఎముకల ఫిక్సేషన్‌కి స్టీల్ ప్లేట్లు, స్క్రూలను వాడుతారు. ఇవి పెద్ద కోత అవసరం చేస్తాయి. కానీ “బోన్-02” ద్వారా కేవలం 180 సెకన్లలో ఎముకలు అతుక్కుపోతాయి. ల్యాబ్ ట్రయల్స్‌లో ఇది అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని పరిశోధకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Doctor Romance: ఇదేం పని డాక్టరూ.. నర్సుతో సరసం కోసం ఆపరేషన్‌ మధ్యలో వదిలేశావ్‌గా!

ఎముకలు అతికిన తర్వాత ఈ గ్లూ గరిష్టంగా 400 పౌండ్ల బలాన్ని, 10 MPa వరకు సంపీడన శక్తిని భరించగలదని పరీక్షల్లో తేలింది. దీంతో భవిష్యత్తులో మెటల్ ఇంప్లాంట్లను పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఎముక సిమెంట్లు, ఎముక ఫిల్లర్లు ఉన్నప్పటికీ వాటికి అంటుకునే లక్షణాలు లేవు. 1940లలో అభివృద్ధి చేసిన పాత పదార్థాలు బయోకంపాటిబిలిటీ సమస్యల కారణంగా విస్మరించబడ్డాయి. అయితే, “బోన్-02” ఆ లోటును పూరించే విప్లవాత్మక ఆవిష్కరణగా భావిస్తున్నారు.

ఈ ఆవిష్కరణ విజయవంతమైతే, భవిష్యత్తులో ఎముకల పగుళ్ల చికిత్స సులభమవడమే కాకుండా, శస్త్రచికిత్స అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *