Agra Murder Case: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఓ భయానక హత్య కేసు 20 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. పోలీసుల కృషితో ప్రధాన నిందితుడు అరెస్టయ్యాడు. మరో నిందితుడు ఇంకా పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Agra Murder Case: 2024 ఫిబ్రవరి 18న అదృశ్యమైన 19 ఏళ్ల యువకుడు రాకేష్‌ను అతని మామ, బంధువు కిడ్నాప్ చేసి హత్య చేశారు. అనంతరం, అతని మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్‌లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాకేష్ పాక్షికంగా కాలిన మృతదేహం ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో కనుగొనబడింది.
ఇది కూడా చదవండి: Anti Immigrant: వలసదారులకు నో ఎంట్రీ: అమెరికాలో మొదలై ప్రపంచ దేశాలకే పాకిన వలస వ్యతిరేకత!
మృతదేహం ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో, పోలీసులు DNA పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు మృతదేహం రాకేష్ ది అని నిర్ధారించాయి. ఈ కేసు దర్యాప్తును స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), సర్వైలెన్స్ సెల్‌కు అప్పగించారు.
సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా ఆధారంగా పోలీసులు 2025 సెప్టెంబర్ 15న ప్రధాన నిందితుడు దేవీరామ్‌ను అరెస్టు చేశారు. మొదట అతను పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆడియో క్లిప్‌లు, ఫోన్ ఆధారాలు బహిర్గతం కావడంతో చివరకు నేరాన్ని అంగీకరించాడు.
విచారణలో, దేవీరామ్ సంచలన విషయాలను ఒప్పుకున్నాడు. తన 16 ఏళ్ల కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు రాకేష్ వీడియో తీశాడని, ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిపాడు. ఈ విషయంతో కోపం వచ్చిన దేవీరామ్, తన మేనల్లుడు నిత్యానంద్‌తో కలిసి రాకేష్‌ను హత్య చేశాడు.
దేవీరామ్, “నా కూతురితో పెళ్లి చేస్తానని నమ్మబలికాను. రాత్రి నా దుకాణానికి పిలిపించి, మఫ్లర్, వైర్‌తో గొంతు కోసి చంపాను. తర్వాత మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్‌లో పెట్టి, లోడర్‌లో సయ్యా నది ఒడ్డుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాం” అని ఒప్పుకున్నాడు. అనంతరం రాకేష్ మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన వస్తువులను నదిలో పడేశామని తెలిపాడు.
దేవీరామ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు, సహ నిందితుడు నిత్య కిషోర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆగ్రాలో కలకలం రేగింది.
