TTD: శ్రీవారి సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తాజాగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు భక్తుల మనసులను గెలుచుకుంటున్నాయి. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా భారీ అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు మంజూరు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
TTD: తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 3 నిర్మాణంపై నిపుణుల కమిటీ ద్వారా అధ్యయనం చేయాలని నిర్ణయించిన టీటీడీ, భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి కేంద్రాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల్లో లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు నిర్ణయాలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi Maldives Visit: భారత్తో పెట్టుకుంటే ఇంతే..! ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపై అంతర్జాతీయ దృష్టి
శిలాతోరణం, చక్రతీర్థం వంటి ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్న టీటీడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో విదేశాల్లో శ్రీవారి ఆలయాల స్థాపనపై నివేదికలు సిద్ధం చేసింది. దీనిపై ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటైంది.
శ్రీవారి సేవను మరింత విస్తృతం చేయడంలో భాగంగా 4 కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కళ్యాణకట్టలో తలనీలాల సమర్పణ కోసం మెరుగైన వసతులు, పారిశుద్ధ్య, భద్రత కల్పించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. తిరుమల పరిపాలన సులభతరం చేయాలన్న ఉద్దేశంతో అన్ని విభాగాలను ఒకచోట కేంద్రీకృతం చేసే నూతన పరిపాలన భవనానికి ఆమోదం లభించింది.
అన్నపూర్ణ క్యాంటీన్, బాలాజీ విశ్రాంతి గృహం, హెచ్వీడీసీ బ్లాకులు వంటి పాత భవనాలను తొలగించాలని నిర్ణయించగా, తాళ్లపాకలో అన్నమయ్య పుట్టిన స్థలంలో అభివృద్ధి చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షల విలువైన మైక్ సెట్లు ఉచితంగా అందించనున్నారు.
