Hyderabad: హైదరాబాద్‌కు మరో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌కి డబుల్ బూస్ట్!

Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక వంతెన రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లే, ఇప్పుడు మీరాలం చెరువుపై మరో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ. 430 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌లో పర్యాటకానికి మరో ప్రధాన కేంద్రంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Hyderabad: ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు మూసీ నది అభివృద్ధి సంస్థ (MRDCL)కి బాధ్యతలు అప్పగించారు. భూసేకరణ, టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, NIT వరంగల్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల అభిప్రాయాలు తీసుకుని తుది నమూనాను రూపొందించనున్నారు.

Hyderabad: చరిత్రపరంగా గొప్ప ప్రాధాన్యత కలిగిన మీరాలం చెరువు 1804లో నిర్మాణం ప్రారంభమై 1806లో పూర్తయింది. మూడో నిజాం హయాంలో దివాన్ మీర్ ఆలం బహదూర్ పేరిట ఈ చెరువు నిర్మించబడింది. మైలార్‌దేవ్‌పల్లి, హసన్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లోని వర్షపు నీటిని నిల్వ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ చెరువులో మూడు దీవులు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్.. ఆ పరిసరాలు మరో జూబ్లీ హిల్స్‌గా మారుతున్నాయా?

Hyderabad: ఈ చారిత్రక చెరువుకు సంబంధించిన రెండు ముఖ్య ఆకర్షణలను జంతు ప్రదర్శనశాల ఇంకా చెరువు అందాలను కొత్త బ్రిడ్జ్ ద్వారా అనుసంధించేందుకు ప్రణాళిక రూపొందించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక ఇది చింతల్‌మెట్ నుంచి శాస్త్రిపురం వరకు సాగుతుంది. దీని పొడవు సుమారు 2.5 కిలోమీటర్లు కాగా, వెడల్పు 16.5 మీటర్లు ఉంటుంది. ఇందులో నాలుగు రోడ్లతో పాటు, పక్కన విశాలమైన కాలిబాటను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Hyderabad: ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తైతే చింతల్‌మెట్, బహదూర్‌పుర, అత్తాపూర్, కిషన్‌బాగ్, శాస్త్రిపురం వంటి ప్రాంతాల్లోని వాహనదారులకు రవాణా సౌలభ్యం బాగా మెరుగవుతుంది. అంతేగాక, బెంగళూరు నేషనల్ హైవే మీదుగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఓ ముఖ్య మార్గంగా నిలవనుంది. ఈ వంతెన పూర్తి కావడంతో హైదరాబాద్ నగరానికి కొత్త అందం, టూరిజానికి మరింత ఉత్సాహం, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌలభ్యం అందించబడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *