Miss Universe: రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఘనమైన వేడుకలో మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. గత సంవత్సరం విజేత రియా సింఘా ఆమెకు ఈ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
Miss Universe: ఈ విజయం తర్వాత మణికా నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో 130 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనబోతున్నారు.
మణికా విశ్వకర్మ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించారు. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తూ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అదే సమయంలో మోడలింగ్‌లో కూడా తన ప్రతిభను నిరూపిస్తున్నారు. గతంలో మిస్ యూనివర్స్ రాజస్థాన్ టైటిల్‌ను గెలుచుకుని, జాతీయ స్థాయికి చేరుకున్నారు.
మణికా అందమైన ముఖం మాత్రమే కాకుండా, సామాజిక కార్యకర్తగా కూడా నిలుస్తున్నారు. మానసిక ఆరోగ్యం, నాడీ వైవిధ్యం (Neurodiversity)పై అవగాహన కల్పించడానికి “న్యూరోనోవా” అనే వేదికను స్థాపించారు. ADHD వంటి పరిస్థితులను రుగ్మతగా కాకుండా, ప్రత్యేకమైన మానసిక సామర్థ్యంగా చూడాలని ఆమె నమ్మకం.
మణికా BIMSTEC సెవోకాన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె శిక్షణ పొందిన NCC క్యాడెట్, క్లాసికల్ డ్యాన్సర్, వక్త. లలిత కళా అకాడమీ, JJ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఆమెను సత్కరించాయి.
ఈ ఏడాది 74వ మిస్ యూనివర్స్ పోటీ నవంబర్ 21, 2025న థాయిలాండ్‌లోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో జరగనుంది. ఈ పోటీ చివరి రౌండ్లో కొత్త మిస్ యూనివర్స్‌ను ఎన్నుకుంటారు. గత సంవత్సరం విజేత విక్టోరియా కైజర్ థాల్విగ్ తన కిరీటాన్ని కొత్తగా ఎంపికైన మిస్ యూనివర్స్‌కు అలంకరించనున్నారు.
