Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండయాత్ర చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వానలు ఇంకా మూడు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ వరుస హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
పశ్చిమ, వాయువ్య దిశలో కదులుతున్న వాయుగుండం క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, దీని ప్రభావం వచ్చే కొన్ని రోజులపాటు తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుందని పేర్కొంది.
వాతావరణశాఖ సూచనల ప్రకారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ స్తంభాల దగ్గర తిరగకూడదు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లరాదు. రైతులు కూడా వర్షాల పరిస్థితిని బట్టి వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.
