Sudharshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దక్షిణాది రాజకీయాల్లో ఆసక్తికర సమీకరణాలు చోటుచేసుకున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటములు తమ తమ అభ్యర్థులను సౌత్ నుంచే నిలబెట్టాయి. తమిళనాడుకు చెందిన సిపి రాధాక్రిష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన ఎన్డీఏకి, తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలోకి దింపింది. ఈ పరిణామం తమిళనాడు – తెలుగు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
Sudharshan Reddy: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, గోవా మాజీ లోకాయుక్త జస్టిస్ (రిటైర్డ్) బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పోటీలో నిలుస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి డీఎంకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం మంగళవారం (ఆగస్టు 19) న్యూఢిల్లీలో జరిగిన డీఎంకే నాయకుల సమావేశంలో తీసుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Big Boss Telugu 9: బిగ్ బాస్ లో తెలంగాణా పోరి.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ లెవెల్ వేరే!
తమిళ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న రాష్ట్ర బీజేపీ, ఎఐఎడిఎంకె నాయకుల డిమాండ్ను స్టాలిన్ తోసిపుచ్చారు. సుదర్శన్ రెడ్డిని సమగ్రత, స్వాతంత్ర్య న్యాయనిపుణుడిగా, పౌర స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నిలబడ్డ న్యాయవేత్తగా అభివర్ణించారు. రాజ్యాంగ విలువలను సమర్థించిన వ్యక్తే ఉపరాష్ట్రపతిగా ఉండాలని డీఎంకే నమ్మకం వ్యక్తం చేసింది.
జూలై 8, 1946న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. సీనియర్ న్యాయవాది ప్రతాప్ రెడ్డి మార్గదర్శకత్వంలో తన న్యాయవృత్తిని ప్రారంభించారు. 1991లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులై, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్తగా పనిచేసి అవినీతి కేసులపై కఠినంగా వ్యవహరించారు.
ఇక ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాక్రిష్ణన్ రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో, సంస్థాగత రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయనను బీజేపీ ఉపరాష్ట్రపతి పోటీలో బరిలోకి దింపింది.
ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరఫున సిపి రాధాక్రిష్ణన్ మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు న్యాయపరమైన కఠినత, మరోవైపు రాజకీయ అనుభవం కలిగిన ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
