Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. సివిల్ లైన్స్లోని సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న ప్రజా దర్బార్ (పబ్లిక్ హియరింగ్) సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రాయిలాంటి వస్తువుతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మరియు స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Delhi CM: ఈ ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల ప్రకారం, ప్రజా దర్బార్లో ఒక వ్యక్తి తన ఫిర్యాదు కోసం ముఖ్యమంత్రి వద్దకు వచ్చినట్లు కనిపించాడు. అయితే అకస్మాత్తుగా ఆమెపై రాయిలాంటి వస్తువుతో దాడి చేయడానికి యత్నించాడు. అంతేకాకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడు దాదాపు 35 ఏళ్ల వయస్సులో ఉన్నాడని, అతని చేతిలో కొన్ని పత్రాలు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
నిందితుడికి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా స్పందించారు. సీఎంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు విచారణ చేస్తున్నారని, త్వరలోనే ఈ సంఘటన వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
