Sadhguru: 79 ఏళ్ల భారతం: “లిబరలైజ్ కాదు… లిబరేట్ చేయాల్సిన సమయం వచ్చింది” – సద్గురు

Amit Shah

Sadhguru: భారతీయుల నమ్మకం, ఆత్మవిశ్వాసం రోజురోజుకీ పెరుగుతోందని ఆధ్యాత్మిక గురువు సద్గురు అన్నారు. ఇప్పటివరకు మనం స్వేచ్ఛకు తలుపులు కొద్దిగా మాత్రమే తెరిచామని, ఇక పూర్తిగా తాళం తీసేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. దేశం 79 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ఈ వేళ, విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక వసతులు ప్రభుత్వ నియంత్రణల నుండి బయటపడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ప్రజలే ముందుకు రావాలి

Sadhguru: సద్గురు మాట్లాడుతూ – “ఇప్పుడు కేవలం లిబరలైజ్ చేయడం కాదు… నిజంగా లిబరేట్ చేయాల్సిన సమయం వచ్చింది. చదువు, పరిశ్రమ, టెక్నాలజీ, మౌలిక వసతులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచితే కుదరదు. వ్యక్తిగత ప్రతిభకు, సృజనాత్మకతకు మార్గం ఇవ్వాలి. రోడ్లు, వంతెనలు, విశ్వవిద్యాలయాల నిర్మాణంలో ప్రజలే ముందుకు రావాలి. ఇది కేవలం ప్రభుత్వ పని కాదు” అని తెలిపారు.

అడ్డంకులు సహజం

“ఎవరు పెద్ద కలలు కంటారో, కొత్త పనులు చేయాలని చూస్తారో వాళ్లు పాత రీతులు మార్చేస్తారు. కొన్నిసార్లు పాత చట్టాలు, పన్నుల నియమాలు సవరించాల్సి వస్తుంది. ఇది తప్పు కాదు… ఇదే అసలు మార్పు దారి. కానీ కొత్త ఆలోచనలను ఆఫీసు ఫైళ్లలో పడేసి ఆలస్యం చేయకూడదు” అని హెచ్చరించారు.

Sadhguru

భవిష్యత్తు – విద్య, టెక్నాలజీ, శక్తి

సద్గురు అభిప్రాయపడ్డారు – “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన బలమైన రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచం మన వైపు చూస్తోంది. కానీ దీన్ని బలోపేతం చేయడానికి పవర్‌ గ్రిడ్లు, స్టోరేజ్, నెట్‌వర్కింగ్ సదుపాయాలు బలంగా ఉండాలి. చిన్న న్యూక్లియర్‌ ప్లాంట్లు అవసరం. చదువు అంటే పుస్తకాల భారం కాదు… ఆలోచనశక్తి, శారీరక బలం పెంపొందించే విధంగా ఉండాలి. చిన్నప్పుడే పిల్లల్లో సృజనాత్మకత పెంచాలి.”

కొత్త దిశలో భారత్

“ఇది ఇక చిన్నపిల్లల దేశం కాదు… యువతలా ఉత్సాహంగా, కొత్తది ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంది. రక్షణ పేరుతో చాలాకాలం అడ్డుకట్ట వేసాం. ఇప్పుడు తాళాలు విప్పాలి. సవాళ్లు అడ్డంకులు కావు… అవే మంటలు అంటించే దివిటీలు. దేశపు ఆత్మ వికసించాలంటే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వాలి” అని సద్గురు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *