Police Drone Raids: తిరుపతి జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ డ్రోన్ల సాయంతో నేరాలను పసిగడుతున్నారు. ఇటీవల నాటు సారా తయారీ కేంద్రాలను గుట్టురట్టు చేసిన పోలీసులు, తాజాగా పేకాట శిబిరాలను బట్టబయలు చేశారు.
Police Drone Raids: రేణుగుంట సబ్ డివిజన్ పరిధిలోని మేర్లపాక, బందారుపల్లె, ముసలిపేడు, కందాడు, రామలింగాపురం గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముసలిపేడు వద్ద పచ్చని పొలాల మధ్య గుంపుగా కూర్చున్న వ్యక్తులు కనిపించారు. డ్రోన్ కెమెరా జూమ్ చేసి చూసిన పోలీసులు షాక్కు గురయ్యారు. వారు పేకాట ఆడుతున్నట్లు స్పష్టమైంది.
డ్రోన్ ద్వారా లొకేషన్ తెలుసుకున్న ఏర్పేడు, సైబర్ క్రైమ్ పోలీసులు 10 మంది సిబ్బందితో కలిసి ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడికి దూసుకెళ్లారు. పోలీసుల రాకతో పేకాట రాయుళ్లు పారిపోవడానికి ప్రయత్నించినా, వారిని అదుపులోకి తీసుకున్నారు.
పచ్చని పొలాల మధ్య రహస్యంగా ఏర్పాటు చేసుకున్న ఈ పేకాట శిబిరానికి మూడంచెల భద్రతను కల్పించుకోవడంతో పాటు, ఇన్ఫార్మర్స్ను కూడా నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ డ్రోన్ టెక్నాలజీకి వారు దొరక్కపోయారు.
మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో 9 మంది పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి రూ.2.36 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అరెస్టయిన వారిలో ఇద్దరు తిరుపతికి, ఐదుగురు కడప జిల్లాకు, ఇద్దరు అన్నమయ్య జిల్లా రాజంపేటకు, మరొక ఇద్దరు కోడూరు, కలకడ ప్రాంతాలకు చెందినవారని తెలిసింది. కేసు నమోదు చేసి, మిగిలిన పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
