India vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తప్పనిసరి? బీసీసీఐ చెప్పిన 4 కారణాలు

India vs Pak: సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో భారత జట్టు తన రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ చుట్టూ ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పఠాన్‌కోట్, పుల్వామా దాడుల నేపథ్యంలో చాలామంది అభిమానులు, మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ జరగాలని స్పష్టంగా అభిప్రాయపడింది.

బీసీసీఐ ఉన్నతాధికారులు వెల్లడించిన నాలుగు ముఖ్య కారణాలు ఇలా ఉన్నాయి:

పాకిస్థాన్‌కు ఉచితంగా పాయింట్లు ఇవ్వలేం

భారత్ మ్యాచ్ ఆడకపోతే, పాకిస్థాన్‌కు 2 పాయింట్లు ఉచితంగా దక్కుతాయి. దీంతో వారు సులభంగా ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. “వారికి లాభం చేకూరేలా మనమే ఎందుకు వెనక్కి తగ్గాలి?” అని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Weather: ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు.. తెలంగాణకు హెవీ రెయిన్ అలెర్ట్

టోర్నమెంట్ ప్రతిష్టకు దెబ్బ

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే ఆసియా కప్ ప్రతిష్ట దెబ్బతింటుంది. టోర్నమెంట్ ఆదాయం తగ్గుతుంది. ఇది ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారత ఆధిపత్యాన్ని బలహీనపరచవచ్చు. పాకిస్థాన్ ఇతర దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా మార్చే అవకాశమూ ఉంది.

ఐసీసీ రాజకీయాల్లో బలహీనత

ప్రస్తుతం ఐసీసీలో భారత్‌కు ఆసియాలోని అనేక దేశాల మద్దతు ఉంది. ఇందులో పాకిస్థాన్ కూడా ఒకటి. మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల ఆ మద్దతు తగ్గిపోవచ్చు. ఫలితంగా టోర్నమెంట్ ఆతిథ్యం వంటి కీలక నిర్ణయాల్లో భారత్ బలహీన పడే ప్రమాదం ఉంది.

ప్రసారదారులకు భారీ నష్టం

2024 నుంచి వచ్చే నాలుగు ఆసియా కప్‌ల ప్రసార హక్కులను రూ.1500 కోట్లకు విక్రయించారు. ఈ భారీ ధర రావడానికి ప్రధాన కారణం భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 10 సెకన్ల ప్రకటన స్లాట్ రూ.25-30 లక్షలకు అమ్ముడవుతుండగా, ఇతర మ్యాచ్‌లలో ఇదే మొత్తం సగం మాత్రమే ఉంటుంది. మ్యాచ్ రద్దయితే ప్రసారదారులకు పెద్ద నష్టం, బీసీసీఐ విశ్వసనీయతకు దెబ్బ తగులుతుందని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ మ్యాచ్ జరగాలా వద్దా అన్న తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్‌లో బీహార్ ఎన్నికల ప్రచారం వేడెక్కే అవకాశం ఉండటంతో, రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశముంది. చివరి నిమిషంలో భారత్ మ్యాచ్‌ను బహిష్కరించే అవకాశం కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *