PM Modi: 40 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ – సీపీ రాధాకృష్ణన్‌పై ప్రశంసల వర్షం

PM Modi: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. రాధాకృష్ణన్ అద్భుతమైన ఉపరాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ, తమ మధ్య ఉన్న నలభై ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన బిడ్డ దేశ అత్యున్నత స్థానాల్లో ఒకదానిని అధిరోహించబోతున్నారని కొనియాడారు.

PM Modi: తాజాగా పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ, “మేము 40 ఏళ్లకు పైగా స్నేహితులం. అప్పుడు నా జుట్టు నల్లగా ఉండేది.. రాధాకృష్ణన్ తలపై కూడా జుట్టు ఉండేది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన క్రీడలకు ఆసక్తి చూపేవారని, కానీ ఎప్పుడూ రాజకీయ ఆటలో పాల్గొనలేదని గుర్తు చేశారు.

లోక్‌సభలో ఏర్పాటు చేసిన సెంగోల్ గురించి ప్రస్తావిస్తూ, అది తమిళనాడుకు చెందిన వారసత్వ చిహ్నమని, ఇప్పుడు రాజ్యసభలో అత్యున్నత స్థానంలో కూడా తమిళనాడుకు చెందిన బిడ్డ కూర్చోబోతున్నారని మోదీ పేర్కొన్నారు. వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణన్ దేశ అత్యున్నత పదవికి ఎదగడం గొప్ప గౌరవమని అన్నారు.

సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాధాకృష్ణన్ సింపుల్ లైఫ్‌స్టైల్, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తర్వాత తన ఎక్స్ ఖాతాలో కూడా మోదీ రాసుకొచ్చారు: “ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను, మంత్రులు, పార్టీ సహచరులు, ఎన్డీఏ నాయకులు రాధాకృష్ణన్ వెంట ఉన్నాము. ఆయన అద్భుతమైన ఉపరాష్ట్రపతి అవుతారని, దేశ పురోగతికి మరింత బలాన్ని చేకూరుస్తారని మేమంతా విశ్వసిస్తున్నాము” అని పేర్కొన్నారు.

రాధాకృష్ణన్ నామినేషన్, మోదీ చేసిన వ్యాఖ్యలు, ఇద్దరి మధ్య ఉన్న పాత స్నేహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *