Supreme Court: వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు!

Supreme Court

Supreme Court: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ వీధుల్లో కుక్కలను పూర్తిగా తొలగించి, శాశ్వతంగా షెల్టర్ హోమ్‌లకు తరలించే అంశంపై వచ్చిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, మునుపటి ఉత్తర్వులో మార్పులు చేసింది. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

Supreme Court: సుప్రీంకోర్టు స్పష్టంచేసిన ప్రకారం, పట్టుబడిన కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి వదలవచ్చు. అయితే రేబిస్ సోకినవి, హింసాత్మకంగా ప్రవర్తించే కుక్కలు, అనారోగ్యంతో ఉన్న కుక్కలను ప్రజల్లో వదలకుండా షెల్టర్ హోమ్‌లలోనే ఉంచాలని ఆదేశించింది.

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టరాదని కోర్టు స్పష్టంచేసింది. మున్సిపల్ అధికారులు కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలని సూచించింది. అదేవిధంగా, పట్టుకునే బృందాన్ని అడ్డుకునే వ్యక్తిపై రూ.25,000 జరిమానా, స్వచ్ఛంద సంస్థ అయితే రూ.2 లక్షల జరిమానా విధించాలని తీర్పునిచ్చింది.

జంతు ప్రేమికులు వీధికుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఫిర్యాదులు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ తీర్పుతో వీధికుక్కల సమస్యకు దేశవ్యాప్తంగా ఒకే విధానంతో సమాధానం దొరకనుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *