Parliament: పార్లమెంట్ భవనంలో మరోసారి భద్రతా లోపం.. అనుమానాస్పద వ్యక్తి అక్రమ ప్రవేశం!

Parliament: భారత పార్లమెంట్ భవనం భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్‌లోకి శుక్రవారం (ఆగస్టు 22) ఉదయం ఒక అనుమానాస్పద వ్యక్తి అక్రమంగా ప్రవేశించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Parliament: పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, శుక్రవారం ఉదయం సుమారు 6:30 ప్రాంతంలో ఓ వ్యక్తి రైల్ భవన్ వైపు నుండి చెట్టు సహాయంతో ప్రహారీ గోడను దూకి, కొత్త పార్లమెంట్ భవనం గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. ఈ దృశ్యాన్ని గమనించిన PCR సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు.

భద్రతా దళాలు వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ప్రారంభ దర్యాప్తులో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు వెల్లడించారు. CISF సిబ్బంది, PCR బృందం చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనలో గోడ ఎత్తు తక్కువగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణమని భద్రతా విభాగం అధికారులు అంగీకరిస్తున్నారు. పార్లమెంట్ భవనం ప్రహారీ గోడ వద్ద ఇటువంటి లోపాలు ఉండడం భద్రతా పరమైన పెద్ద లోపంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆ వ్యక్తిని స్పెషల్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు ఇతర సంస్థలు విచారిస్తున్నాయి. అతని నేపథ్యం, ఉద్దేశ్యం, ఎటువంటి నేర శ్రేణులతో సంబంధం ఉందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

ఇది తొలిసారి కాదు. గతంలోనూ పార్లమెంట్ భద్రతా లోపాలు బయటపడి విమర్శలకు గురయ్యాయి. దేశానికి హృదయ భాగమైన ఈ ప్రాంతంలో తరచూ జరిగే భద్రతా వైఫల్యాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఘటనతో మళ్లీ కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “దేశంలోనే అత్యంత రక్షణ కలిగిన భవనంలోకి సులభంగా ఎవరో ప్రవేశిస్తే, ప్రజల భద్రత ఎలా ఉంటుంద?” అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *