Telangana High Court: తెలంగాణ రాజకీయ వాతావరణంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో రెండో రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఆదేశాలు జారీ చేసింది.
Telangana High Court: పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమని స్పష్టంగా తెలిపిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. అయితే నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. అదేవిధంగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
నిన్న విచారణలో హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయం ఎప్పుడు? నివేదికపై చర్యలు ముందుగా తీసుకుని తర్వాత అసెంబ్లీలో పెడతారా? లేక అసెంబ్లీలో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటారా? అనే అంశాలపై స్పష్టత కోరింది.
ఈ ప్రశ్నలకు సమాధానంగా అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు సమాధానమిచ్చారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, హరీష్రావు ఇద్దరూ ఎమ్మెల్యేలే కాబట్టి అసెంబ్లీ వేదికపైనే నివేదికను చర్చించాలన్నది ప్రభుత్వ అభిప్రాయం అని తెలిపారు.
ఈ కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు రాజకీయంగా, న్యాయపరంగా అనేక చర్చలు జరుగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ముందే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదిక, హైకోర్టు వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
