Cyber Crime: ముంబైలో సైబర్ నేరగాళ్ల గుట్టరట్టు చేశారు పోలీసులు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో బ్యాంక్ ఖాతాలు తెరిచి కోట్లు కొట్టగొడుతున్న ముఠాను పట్టుకున్నారు. బిగ్ సైబర్ క్రైమ్ను చేధించిన పోలీసులు.. 60 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ముంబై మురికివాడలకు చెందిన పేదలకు డబ్బు ఆశ చూపించి ఆధార్, పాన్ కార్డులను సేకరించారు. ఆ ఐడెంటీటీలతో ఫోన్ నంబర్లు తీసుకుని, బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి లావాదేవీలు జరిపారు. ఇలా మొత్తం 943 బ్యాంక్ అకౌంట్లు తెరిచినట్లు విచారణలో తేలింది. వాటిలో 181 ఖాతాలను నేరుగా సైబర్ మోసాల కోసం వాడారు.
ఎంత డబ్బు దోచుకున్నారు?
దేశవ్యాప్తంగా 339 ఫిర్యాదులు ఈ ఖాతాలతో లింక్ అయ్యాయి.
- ముంబైలో 16 కేసులు (రూ.1.67 కోట్లు)
- మహారాష్ట్ర అంతటా 46 కేసులు (రూ.10.57 కోట్లు)
- ఇతర రాష్ట్రాల నుండి 277 కేసులు
మొత్తం మీద ఈ ముఠా రూ.60.82 కోట్లు దోచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆన్లైన్ గేమింగ్, షేర్ ట్రేడింగ్, ఈ కామర్స్ వంటి మోసాల్లో ఈ ముఠా నైపుణ్యం సాధించింది. వీరి నుంచి 50కి పైగా బ్యాంక్ పాస్బుక్స్, 105 సిమ్ కార్డ్స్, వందలాది ఏటీఎం కార్డులు, స్వైప్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని కండివాలిలో ఉన్న ‘డిజి సర్జ్ కన్సల్టెన్సీ’, ‘ప్రిటిట్ లాజిస్టిక్స్’ అనే రెండు సంస్థల ముసుగులో ఈ స్కామ్ నడిపారు. ఆగస్టు 12న క్రైమ్ బ్రాంచ్ దాడి చేసి, వైభవ్ పటేల్, సునీల్ కుమార్ పాస్వాన్, అమన్కుమార్ గౌతమ్, ఖుష్బు సుందర్జల, రితేష్ బండేకర్లతో సహా కీలక నిందితులను అరెస్టు చేసింది.
సైబర్ నేరగాళ్లు పేదల పేరుతో అకౌంట్లు తెరచి, పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని పోలీసులు స్పష్టంచేశారు. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
