Fake Patient: అమ్మ బాబోయ్ ఎవడ్రవీడు.. రోగిలా నటించి డాక్టర్ ఐఫోన్ దొంగిలించాడు!

Fake Patient: సినిమాల్లో వేషాలు మార్చి దొంగతనాలు చేసే సన్నివేశాలు మనం చూసే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిజజీవితంలో అలాంటి సంఘటన వెలుగు చూసింది. వికలాంగుడిలా నటిస్తూ హాస్పిటల్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి, ఎంతో చాకచక్యంగా డాక్టర్‌ జేబులోంచి ఐఫోన్‌ను ఎత్తేసి వెళ్లిపోయాడు. అయితే కాసేపటికే పోలీసులు అతడిని పట్టేశారు.

కాన్పూర్ హాలెట్ హాస్పిటల్‌లో ఘటన
Fake Patient: ఆగస్టు 20న మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి వికలాంగుడిలా నటిస్తూ కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రిలోకి వచ్చాడు. వాకింగ్‌ స్టిక్‌ పట్టుకుని, రోగిలా ప్రవర్తిస్తూ డాక్టర్లను నమ్మించాడు. దీంతో వారు అతనికి మందులు రాసిచ్చారు. ఆ తర్వాత లాబీలో నడుస్తున్నప్పుడు, పక్కనే మాట్లాడుకుంటున్న ఇద్దరు మహిళా డాక్టర్ల దగ్గరగా వెళ్లి, ఒకరి యాప్రాన్‌ నుంచి నెమ్మదిగా ఐఫోన్‌ను ఎత్తేశాడు.

సీసీ కెమెరాల్లో రికార్డ్
ఫయాజ్‌ బయటికి వెళ్లిపోయాక, తన ఫోన్‌ కనిపించకపోవడంతో డాక్టర్‌ అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించింది. అక్కడి ఫుటేజ్‌లో ఫయాజ్‌ స్పష్టంగా కనిపించాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేవలం ఒక గంటలోనే ఫయాజ్‌ను పట్టుకొని ఫోన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల చాకచక్యం
“సీసీటీవీ ఫుటేజ్ కారణంగా కేసును త్వరగా ఛేదించగలిగాం” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఫయాజ్‌ ఇంతకుముందు కూడా ఇలాంటి వేషాలు వేసి ఫోన్‌ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *