Vinayaka Chavithi: వినాయక చవితి సమీపిస్తోంది. 2025 ఆగస్టు 27న హిందూ కుటుంబాలంతా ఎంతో ఆర్భాటంగా గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ, ప్రతి వాడ వాడలో గణపయ్య పాటలు, భజనలు మార్మోగుతాయి. గణపయ్య ఈ కాలంలో భూలోకానికి వచ్చి తొమ్మిది రోజుల పాటు భక్తుల ఇంటిలో ఉంటాడనే నమ్మకం ఉంది. అందుకే అనేక మంది తమ ఇళ్లలో విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు.
Vinayaka Chavithi: అయితే వినాయక విగ్రహం ప్రతిష్టించే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. విగ్రహం కొనుగోలు చేసే సమయంలో తొండం కుడి వైపు తిరిగి ఉండే గణపయ్య విగ్రహాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే గణేశుడు ఎలుక వాహనంపై కూర్చున్న విగ్రహం కొనడం శుభప్రదమని భావిస్తారు. కానీ నిలబడిన విగ్రహాలు, నాట్యం చేస్తున్న గణపయ్య విగ్రహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదని సూచిస్తున్నారు.
అంతేకాకుండా గణేశుడి పక్కన ఏనుగు విగ్రహం ఉన్న విగ్రహాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. డ్యామేజ్ అయిన విగ్రహాలను మాత్రం అసలు ఇంటికి తేవద్దు. ఇది శుభప్రదం కాదని అంటున్నారు. గణపయ్య విగ్రహాన్ని కొందరు మూడు రోజుల పాటు ఇంట్లో ప్రతిష్టిస్తే, మరికొందరు ఐదు రోజులు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు జరుపుతారు.
ఇక ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత తప్పక పాటించాల్సిన కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేసి గణేశుడికి నైవేద్యం సమర్పించాలి. ముఖ్యంగా పండితులు చెప్పే మరో నియమం ఏమిటంటే, ఈ రోజుల్లో ఇంట్లో నాన్ వెజ్ అస్సలు వండకూడదు. ఇలా నియమాలు పాటిస్తే గణేశుడు కృప దయలు కురిపిస్తారని భక్తుల నమ్మకం.
