Vijayawada Kanaka Durga: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి పర్వతం భక్తజనాలతో కిటకిటలాడుతోంది. సాధారణ భక్తులతో పాటు భవాని మాలధారుల రాకతో కొండపై “జై భవాని” నినాదాలు మార్మోగుతున్నాయి.
Vijayawada Kanaka Durga: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు, దేవస్థానం ఈఓ శీనానాయక్ మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Indrakeeladri: మహా నవమి రోజున ఇంద్రకీలాద్రి అమ్మవారి నేటి అలంకారం.. శ్రీ మహిషాసుర మర్దిని!
ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కారణంగా మహిళా భక్తుల రాక భారీగా పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యంతో ఎక్కువ సంఖ్యలో మహిళలు అమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.

అధికారులు ప్రాథమిక సదుపాయాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భక్తులకు సురక్షిత తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లు, చిన్నారులకు వేడి పాలు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. భవానీల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, మాల విరమణ సమయంలో అసంతృప్తి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

“భక్తుల సంతృప్తికర దర్శనమే మా లక్ష్యం” అన్న దృక్పథంతో అధికారులు నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ఆనందానుభూతి కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

భక్తులు కూడా ఈ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారుల కృషిని ప్రశంసిస్తున్నారు.
