Khairatabad: హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ గణేష్ ఆగమనానికి సిద్ధమైంది. బుధవారం వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటలకు తొలి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. 20 మంది సిద్ధాంతులు ఈ మహోత్సవ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.
Khairatabad: 1954లో కేవలం ఒక అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ప్రతిష్ట, నేటికి 71 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. మొదట ప్రతి ఏడాది ఒక అడుగు పెరుగుతూ వచ్చిన విగ్రహం, 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గించబడుతోంది. ఈసారి గణేష్ విగ్రహం 69 అడుగుల ఎత్తుతో, 28 అడుగుల వెడల్పుతో భక్తుల ముందుకు రానుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడిన త్రిశక్తి సమేతుడిగా గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు.
భక్తుల భద్రత కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు, 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్సులు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 వరకు ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఉంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
భక్తుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ మార్గం మూసివేయబడింది. అలాగే సైఫాబాద్, ఇక్బాల్ మీనార్, తెలుగు తల్లి జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వంటి మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వస్తాయి. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, హెచ్ఎండీఏ పార్కింగ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు.
ఈ ఏడాది గణేష్ విగ్రహం ప్రత్యేకతల్లో ఒకటి లక్ష రుద్రాక్షలతో అలంకరించబడిన గణపయ్య మెడ, 60 అడుగుల చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతం. అదేవిధంగా తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల హోమాలు నిర్వహించనున్నారు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ సహా 150 మంది కళాకారులు మూడు నెలలపాటు కృషి చేసి ఈ మహా గణపతిని తీర్చిదిద్దారు.
ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో అనేక విశేషాలు ఉన్నాయి. 1960లో ఏనుగుపై ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం, 1982లో రెండు పడవలపై విగ్రహాన్ని హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయడం, 2011లో 500 కిలోల లడ్డూ సమర్పించడం వాటిలో ముఖ్యమైనవి. ఈసారి కూడా భక్తులు గణపయ్యను దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
