Viral News: ఇద్దరు పిల్లలను కని, పెంచడమే నేటి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతోంది. కానీ రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన ఒక మహిళ ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనివ్వడం ఆశ్చర్యకరం. ఈ ఘటన వైద్యరంగంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశమైంది.
Viral News: 55 ఏళ్ల రేఖ గల్బెలియా ఇటీవల 17వ సారి విజయవంతంగా ప్రసవించి, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల ప్రకారం ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే రేఖ, ఆమె భర్త కావ్రా కల్బెలియా ఇప్పటివరకు 16 మంది పిల్లలను కనేశారు. వారిలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె చిన్న వయసులోనే మరణించారు. మరో ఐదుగురికి ఇప్పటికే వివాహాలు జరిగాయి.
రేఖ తాజాగా ఆస్పత్రికి చేరినప్పుడు నాలుగో ప్రసవం అని వైద్యులకు చెప్పి మోసం చేసినట్లు బయటపడింది. కానీ పరీక్షల్లో అసలు విషయం తెలిసి వైద్యులు షాక్ అయ్యారు.
రేఖ కుమార్తె శిలా కల్బెలియా మాట్లాడుతూ తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇళ్లు లేదని, పిల్లల విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంది. కావ్రా కల్బెలియా మాట్లాడుతూ పిల్లలను పోషించడానికి వడ్డీ వ్యాపారుల వద్ద 20 శాతం వడ్డీకి అప్పులు చేసి, ఇప్పుడు అప్పులు లక్షల్లో పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ పథకం కింద ఇల్లు మంజూరైనప్పటికీ, భూమి తమ పేరు మీద లేకపోవడంతో లబ్ధి పొందలేకపోయామని చెప్పారు.
ఈ ఘటనపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “ఈ కాలంలోనూ 17 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనం” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రాజస్థాన్లో కూడా ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అమలు చేసి, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
