PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ‘సెమికాన్ ఇండియా 2025’ గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 2 నుండి 4 వరకు జరిగే ఈ ముగ్గురోజుల సమావేశం, భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉంది.
PM Modi: ఈ సదస్సులో 48 దేశాల నుండి 2,500 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అదనంగా, 50 కంటే ఎక్కువ మంది ప్రపంచ నాయకులు, 150కి పైగా అంతర్జాతీయ వక్తలు, 350 కంటే ఎక్కువ కంపెనీలు ప్రదర్శనకారులుగా ఉండగా, మొత్తం 20,750 మందికి పైగా హాజరు కానున్నారు. కార్యక్రమంలో ఆరు దేశాల రౌండ్‌టేబుల్ చర్చలు, స్టార్టప్ పావిలియన్లు, ప్రత్యేక ప్రదర్శన ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి మోదీ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని సీఈఓ రౌండ్‌టేబుల్‌లో కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశం ద్వారా భారతదేశంలో సెమీకండక్టర్ డిజైన్, తయారీ, అధునాతన ప్యాకేజింగ్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పరిశోధన & అభివృద్ధి రంగాలు మరింత బలోపేతం కానున్నాయని పీఎంవో ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) పథకం, స్టార్టప్‌ల ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, రాష్ట్రాల స్థాయి విధానాల అమలు, వర్క్‌ఫోర్స్ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి.
గతంలో 2022లో బెంగళూరు, 2023లో గాంధీనగర్, 2024లో గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమికాన్ ఇండియా సమావేశాలు, దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈసారి మరింత విస్తృతంగా, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం విశేషం.
ఇటీవలి జపాన్ పర్యటనలో, భారత్–జపాన్ మధ్య 21 ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో సెమీకండక్టర్ రంగం, కృత్రిమ మేధస్సు సహకారం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జపాన్ నుండి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు బదిలీ అవుతుండడం వల్ల, చైనాపై ఆధారపడకుండా ఆర్థిక భద్రత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
