Jasprit Bumrah: భారత్–ఇంగ్లండ్ మధ్య ఇటీవల జరిగిన ఆండర్సన్–టెండూల్కర్ సిరీస్ తర్వాత, టీమిండియా ఫాస్ట్ బౌలర్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు నుంచే సెలెక్టర్లు జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టుల్లో మూడు మాత్రమే ఆడతాడని ప్రకటించారు. సిరీస్ ముగిసే సమయానికి అదే నిజమైంది.
Jasprit Bumrah: ఇందులో భాగంగా, భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాస్ట్ బౌలర్లను అన్ని ఫార్మాట్లలో ఆడించడం సాధ్యం కాదని, వారిని రక్షించడానికి బీసీసీఐ ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా బుమ్రా లాంటి స్టార్ బౌలర్లకు తగినంత విశ్రాంతి ఇచ్చి, ఐపీఎల్‌కి బదులుగా ముఖ్యమైన సిరీస్‌లపై దృష్టి పెట్టేలా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భరత్ అరుణ్ మాట్లాడుతూ – “బ్యాట్స్మెన్లు, స్పిన్నర్లు అన్ని ఫార్మాట్లలో ఆడగలరు. కానీ ఫాస్ట్ బౌలర్లకు ఇది సాధ్యం కాదు. ముఖ్యమైన సిరీస్‌లకు ముందు బుమ్రా వంటి బౌలర్లకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. దానికి బదులుగా ఐపీఎల్ మిస్ అయితే, బీసీసీఐ వారికి నష్టపరిహారం ఇవ్వాలి” అని సూచించారు.
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో బుమ్రాకు వెన్నులో గాయం కావడంతో మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున 12 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు సాధించాడు. ఆపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో రెండుసార్లు ఫైవ్-వికెట్ హాల్ కూడా నమోదు చేశాడు.
బుమ్రా వంటి ప్రధాన బౌలర్లను రాబోయే సిరీస్‌లలో ఫిట్‌గా ఉంచాలంటే, బీసీసీఐ ఏ విధానాన్ని అవలంబించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. భరత్ అరుణ్ సూచనలతో మరోసారి ఫాస్ట్ బౌలర్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై చర్చ ముమ్మరమవుతోంది.
