Mega DSC 2025: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశలోకి ప్రవేశించింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఇటీవల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఫలితాల ఆధారంగా మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తున్నారు.
Mega DSC 2025: మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలనను ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించారు. ఈసారి రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
పాఠశాల విద్యాశాఖ ప్రకటన ప్రకారం, రెండో విడతలో తొలి విడతలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో తదుపరి మెరిట్ లిస్ట్ అభ్యర్థులు, ప్రత్యేక విద్య (Special Education) అభ్యర్థులు, గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిపోయిన పోస్టులకు అభ్యర్థులను పిలిచారు. వీరందరికీ కాల్ లెటర్లు జారీ చేసి, మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు.
ఒకవేళ కాల్ లెటర్లు ఆలస్యంగా అందితే, బుధవారం ఉదయం నుంచే ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ధ్రువపత్రాల పరిశీలనకు సుమారు 900 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశముందని అంచనా. వీరిలో దివ్యాంగులు 120 మంది వరకు ఉండగా, వారికి వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లను మెడికల్ బోర్డు ద్వారా పరిశీలిస్తారు.
అధికారుల సమాచారం ప్రకారం, రెండో విడత పరిశీలనలో ఎవరి పత్రాలు తిరస్కరించబడితే, వారి స్థానంలో కొత్త అభ్యర్థులను మూడో విడతలో పిలుస్తామని స్పష్టం చేశారు.
