Karimnagar: కరీంనగర్లో ఓ యువకుడు తనదైన శైలిలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపాడు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు వేస్తున్నారు, అన్ని రకాల టాక్స్లు వసూలు చేస్తున్నారు. అయితే ఆ టాక్స్లతో రోడ్లు ఎందుకు సరిచేయడంలేదని ప్రశ్నించాడు.
Karimnagar: రేకుర్తి చౌరస్తా వద్ద నడిరోడ్డుపై ఉన్న గుంతలో కూర్చొని ఈ వినూత్న నిరసన తెలిపాడు కోట శ్యామ్ కుమార్. ఆయన మాట్లాడుతూ, “కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే నేషనల్ హైవే అయినా రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రోడ్డుపై వాహనం నడపాలంటే భయం వేస్తుంది” అని వాపోయాడు.
శ్యామ్ కుమార్ మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “GSTలు, రోడ్ టాక్స్లు కడుతున్నాను. కానీ రోడ్లు మాత్రం సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నాకెంత ఫైన్ వేస్తారు?” అని కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ను నిలదీశాడు. ముందుగా రోడ్లను సరిచేసి తరువాత జరిమానాలు వసూలు చేయాలని డిమాండ్ చేశాడు.
రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని శ్యామ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ప్రజల పన్ను డబ్బుతో నిర్మించాల్సిన రోడ్లు ఇంత దయనీయ స్థితిలో ఉండటం పట్ల స్థానికులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
