Midnight Surprise Checks: అర్ధరాత్రి చెక్‌పోస్ట్‌లో కలెక్టర్..ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

Midnight Surprise Checks: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్‌లో అర్ధరాత్రి జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లారీ డ్రైవర్లు, సిబ్బంది సహా అక్కడున్న వారు ఎవ్వరూ ఊహించని విధంగా ఇద్దరు అధికారులు స్వయంగా మాటు వేసి తనిఖీలు జరిపారు.

Midnight Surprise Checks: రాత్రి పదకొండు గంటల సమయంలో సాధారణ దుస్తుల్లో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. వెంటనే వరుసగా వస్తున్న లారీలను ఆపి స్వయంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఈ అనూహ్య చర్యతో చెక్‌పోస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి.

ఇటీవల కారంపూడి ప్రాంతంలో యూరియాను అక్రమంగా తరలించే వ్యాపారి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ చెక్‌పోస్ట్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణాలో యూరియా కొరత ఉండటంతో ఇక్కడి వ్యాపారులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అనుమానాల నేపథ్యంలోనే కలెక్టర్, ఎస్పీ నేరుగా తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: AP Prisons Department: ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

దాచేపల్లి పరిసర గోడౌన్లలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు ఎటువంటి అక్రమ రవాణా జరగలేదని నిర్ధారించారు. దీంతో కింది స్థాయి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో అక్రమ యూరియా రవాణా జరిగితే ఏకా చట్టం కింద కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు.

సోషల్ మీడియాలో యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. యూరియా రవాణా, పంపిణీపై కింది స్థాయి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *