Emotional Couple: జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. భార్య మృతిచెందడంతో భర్త కూడా మనోవేదన తట్టుకోలేక వెంటనే ప్రాణాలు వదిలేశాడు. దంపతులిద్దరిని ఒకే పాడేపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం గ్రామమంతా కన్నీటి వాతావరణాన్ని మిగిల్చింది.
Emotional Couple: అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మి, రాజనర్సులు దంపతులు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. దాదాపు ఇరువై ఏళ్ల క్రితం రాజనర్సు ప్రమాదంలో తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత నుంచి భార్య లక్ష్మి ఆయనకు అన్నీ అయింది. ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా, ఒక తల్లిలా అంకితభావంతో భర్తను చూసుకుంది. భర్త కోసం ఎన్నో కష్టాలు పడ్డా, ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
ఇది కూడా చదవండి: Telangana Politics: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం – ప్లాన్-C ఎంట్రీ!
ఇటీవలి కాలంలో లక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతున్న సమయంలోనే శనివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. భార్య మృతిచెందిన వార్త రాజనర్సుకు భరించలేని విషాదాన్ని మిగిల్చింది. “నువ్వు లేకుంటే జీవితం నాకెందుకు?” అన్నట్టుగా భార్య మృతిచెందిన కొద్ది సేపటికే భర్త కూడా కన్నుమూశాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు ఈ దంపతుల మృతితో రోదనలు ఆపుకోలేకపోయారు. గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా విషాదభరితమైంది. చివరికి ఇద్దరినీ ఒకే పాడేపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
కష్టసుఖాలను పంచుకుంటూ జీవితం గడిపిన ఈ దంపతులు, చివరి శ్వాస వరకు కూడా విడిపోకుండా ఒకే సమయంలో లోకాంతరమయ్యారు. భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రతి ఒక్కరి కంటతడి పెట్టించింది.
