Tilak Varma: పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్. ఒకరకంగా రెండు దేశాల ప్రజలూ దీనిని యుద్ధంగానే చూస్తారు . ఆటలో గెలుపోటములు సహజం అని రెండు దేశాల్లోని ఏ ఒక్కరూ కూడా అనుకోరు . కచ్చితంగా గెలిచి తీరాల్సిందే ! అనుకుంటారు . మామూలు మ్యాచ్ లకే ఇంత హైప్ ఉంటుంది . మరి ఏదైనా టోర్నీ అంటే . . అది మామూలుగా ఉండదు. అగ్గి రాజేసే బంతులు . . కసితీరా బంతిని బాదే బ్యాటర్లు . . మైదానంలోనే కాదు.. బయట కూడా ఉద్విగ్న వాతావరణం. రెండు దేశాల్లోనూ యుద్ధ గంభీరత ఉంటాయి.
Tilak Varma: ఇప్పుడు పహల్గామ్ దాడి తరువాత ప్రతి భారతీయుడు పాకిస్తాన్ పై రగిలిపోతున్నాడు. పాకిస్తాన్ పై ఓటమి అది ఆటైనా . . మాటైనా ఏదైనా భరించడానికి సిద్ధంగా భారతీయులు లేరు. ఇలాంటి సమయంలో ఆసియా కప్ టోర్నీ వచ్చింది. భారత్ ఆడకూడదని కొందరు . . ఆడాలని కొందరు . . పాక్ ను చావు దెబ్బ తీయాలని అందరూ కోరుకున్నారు. కొంత ప్రతిఘటన మధ్య పాకిస్తాన్ . . భారత్ మ్యాచ్ లు జరిగే పరిస్థితి వచ్చింది . టోర్నీలో మూడుసార్లు పాకిస్తాన్ ను భారత్ ఢీ కొట్టింది. మొదటి మ్యాచ్ లీగ్ దశలో . . చిత్తుగా ఓడింది . రెండో మ్యాచ్ సూపర్ ఫోర్ దశలో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ . . మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడినా మరో అవకాశం ఉంది . . అలా అని సరిపెట్టుకుని మళ్ళీ పోరాటానికి సిద్ధం అయ్యే ఛాన్స్ ఉంది . కానీ . . ఫైనల్స్ అలా కాదు . చావో రేవో తేల్చుకోవాల్సిందే ! ఇలాంటి పరిస్థితిల్లో ఆడడం అంటే మామూలు విషయం కాదు . టీమిండియాకు ఆదివారం అగ్నిపరీక్ష ఎదురైంది . ప్రత్యర్థి బలహీనంగా కనిపించవచ్చు. రెండు సార్లు ఓడించి ఉండవచ్చు. కానీ , పుంజుకోడనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వారికీ ఇది చావో రేవో కదా . కచ్చితంగా తన బలాన్ని అంతా ఉపయోగిస్తాడు . అదే చేసింది పాకిస్తాన్. చాలా తక్కువగా ఉన్న విజయ లక్ష్యాన్ని భారత్ ఈజీగా చేరుకోకుండా అడ్డు పడింది . వరుసగా నాలుగు వికెట్లు . . 20 పరుగుల తేడాతో . . అంతే . . భారతదేశం అంతా తుపాను ముందరి ప్రశాంతత. ఏమిటి ? ఇలా అయింది? టోర్నీ అంతా . . అన్ని దేశాలపై వీర బాదుడు బాదిన బ్యాటర్లు ఇలా దొరికిపోయారేమిటి ? అనే నిరాశ . అదిగో సరిగ్గా అప్పుడు ఒక్కడు వచ్చాడు.
అదేదో సినిమాలో చెప్పినట్టు . . జాగ్రత్తగా . . ఒక్కో ఇటుక పేర్చినట్టు . . పద్ధతిగా కొట్టేశాడు. ఆడు మామూలోడు కాదురా బుజ్జీ . . తెలుగోడు ! అనిపించాడు. అతనే తిలక్ వర్మ(Tilak Varma). అవతల వరుసగా వికెట్లు పడిపోయిన పరిస్థితి. రన్ రేట్ తగ్గకుండా చూడాలి.. చివరి వరకూ వదలకూడదు . ఇంకో వికెట్ పడిందా . . మ్యాచ్ చేజారిపోయే ఛాన్స్ లు ఎక్కువ. అలాంటి పరిస్థితిలో తెలుగోడు తిలక్ వర్మ(Tilak Varma) ఆచి , తూచి . . జాగ్రత్తగా ఆడుతూ అజేయంగా 69 పరుగులు చేసి పాకిస్తాన్ టీమ్ మొత్తాన్ని కుప్పకూల్చేశాడు. ఆటైనా సరే . . మీ మీద గెలుపు మాదే. అనే రేంజి సంబరాల్ని భారత ప్రజల్లో తెచ్చాడు.
147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఫైనల్ కు ముందు ప్రతి మ్యాచ్ లోనూ సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ 5 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. శుభ్మాన్ గిల్ కూడా 12 పరుగులకు చేరుకోలేకపోయాడు.
ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(Tilak Varma), సంజు సామ్సన్ తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని, ఆ తర్వాత శివం దుబే తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని నిర్ధారించాడు.
ధోనీ ప్రశాంతత . . కోహ్లీ దూకుడు . .
తిలక్ వర్మ(Tilak Varma) మొదట ధోనీలా ప్రశాంతతను ప్రదర్శించాడు. ఎక్కడా ఒత్తిడి కనిపించనీయలేదు . రన్ రేట్ పట్టించుకోలేదు . నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు . సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఉంటె ఏమి చేసేవాడో . . అదే చేశాడు తిలక్ వర్మ. ఇక ఒక్కసారి స్థిరపడిన తర్వాత, విరాట్ కోహ్లీ లాగా, జట్టును విజయపథంలో నడిపించిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నాడు.
తిలక్ (Tilak Varma)తన ఇన్నింగ్స్లో మొదటి 26 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. కానీ తరువాతి 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు, అతను సింగిల్స్ – డబుల్స్ తో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతను సింగిల్స్ – డబుల్స్ ద్వారా 33 పరుగులు చేశాడు. ఫోర్లు – సిక్సర్ల ద్వారా 36 పరుగులు చేశాడు.
ఇప్పుడు యావత్ భారతావని అంటోంది . . శభాష్ తెలుగోడా తిలక్ వర్మ ! అని .
By KVD Varma, Digital Creator
