ICU Fire Accident: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లోని సవాయి మాన్ సింగ్ (SMS) హాస్పిటల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐసియులో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.
ICU Fire Accident: ట్రామా సెంటర్ న్యూరో ఐసియు రెండవ అంతస్తులోని స్టోర్ రూమ్లో రాత్రి 1:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు తీవ్రంగా వ్యాపించి, లోపల ఉన్న ఫైళ్లు, వైద్య పరికరాలు, రక్త నమూనా గొట్టాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. విష వాయువులు విడుదల కావడంతో పేషెంట్లు శ్వాస ఆడక కోమాలోకి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Snow Storm on Evarest: ఎవరెస్ట్పై మంచు తుఫాన్ బీభత్సం.. 16 వేల అడుగుల ఎత్తులో చిక్కుకున్నవేయి మంది పర్వతారోహకులు
ట్రామా సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ అనురాగ్ ధకాడ్ మాట్లాడుతూ – “మా నర్సింగ్ సిబ్బంది, వార్డ్ బాయ్స్ వీరోచితంగా వ్యవహరించారు. మంటలు వ్యాపించేలోపే ఎక్కువమంది రోగులను ట్రాలీలపై తరలించగలిగాం. కానీ ఆరుగురిని రక్షించలేకపోయాం,” అని బాధ వ్యక్తం చేశారు.
ట్రామా సెంటర్లో మొత్తం 24 మంది రోగులు ఉన్నారు — ట్రామా ఐసియులో 11 మంది, సెమీ-ఐసియులో 13 మంది. మంటలు వ్యాపించిన ఐసియులో ఉన్న ఆరుగురు రోగులు విష వాయువుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Women World Cup IND vs PAK: పాకిస్తాన్ కు ఆదివారం పీడకల.. అమ్మాయిల మ్యాచ్ లోనూ భారత్ చేతిలో చిత్తు!
అగ్నిప్రమాదానికి నిజమైన కారణం ఏమిటన్నదానిపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ, “దర్యాప్తు పూర్తయ్యాక మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలిస్తాం,” అని తెలిపారు.
అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆసుపత్రిని సందర్శించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, “ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది. నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని ప్రకటించారు. ఈ ఘోర ఘటనతో జైపూర్ నగరం విషాదంలో మునిగిపోయింది. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోతే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని అధికారులు తెలిపారు.
