UPI Payments: భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. రోజూ కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇప్పుడు కొత్త పంథాలోకి అడుగుపెడుతోంది. ఇకపై చెల్లింపులు చేయడానికి పిన్ అవసరం లేదు. ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర ద్వారా నేరుగా ట్రాన్సాక్షన్ను పూర్తి చేయవచ్చు.
UPI Payments: ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోబడినది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పు వచ్చింది. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడంతో పాటు, వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడం RBI ప్రధాన ఉద్దేశ్యం. ప్రత్యామ్నాయ ప్రామాణీకరణ పద్ధతులను అనుమతిస్తూ RBI నూతన మార్గదర్శకాలు ప్రకటించింది.
ఈ కొత్త పద్ధతి పూర్తిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు చెల్లింపు సమయంలో పిన్ టైప్ చేయడం బదులుగా తన ముఖం లేదా వేలిముద్ర స్కాన్ చేయాలి. ఫోన్ కెమెరా లేదా స్కానర్ ద్వారా సేకరించిన బయోమెట్రిక్ డేటా UIDAI ఆధార్ సర్వర్కి సురక్షితంగా పంపబడుతుంది. ధృవీకరణ పూర్తైన వెంటనే చెల్లింపు విజయవంతంగా పూర్తవుతుంది.
ఈ మొత్తం ప్రక్రియ కొన్ని సెకన్లలో ముగుస్తుంది. చెల్లింపులు మరింత వేగవంతంగా, సులభంగా, అలానే భద్రతతో సాగుతాయి. ముఖ్యంగా పిన్ గుర్తుంచుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ అక్టోబర్ 8 నుండి అమల్లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ టెక్నాలజీని ముంబైలో జరుగనున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో ఆవిష్కరించనుంది. NPCI ఇప్పటివరకు అధికారిక వ్యాఖ్యానాన్ని చేయకపోయినా, అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని సమాచారం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భారత డిజిటల్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. “ఇక నుంచి మీ గుర్తింపే మీ పాస్వర్డ్ అవుతుంది,” అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్పు యూపీఐ వ్యవస్థను మరింత భద్రతతో కూడిన, ఆధునిక దిశగా తీసుకెళ్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
UPIలో కొత్త ఫీచర్: ఇక పిన్ అవసరం లేదు! ముఖ గుర్తింపు లేదా వేలిముద్రతో చెల్లింపులు చేసే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం.
