Poland: పోలాండ్లో తవ్వకాల్లో వెలుగుచూసిన ఒక ప్రాచీన నిధి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రోజిక్ అడవిలో జరిగిన ఈ అన్వేషణలో 1,500 ఏళ్ల నాటి నిధి బయటపడింది. ఇందులో 631 బంగారు నాణేలు, అరుదైన బంగారు హారం లభించాయి. ఈ ఆవిష్కరణ దేశ చరిత్రలోనే అత్యంత విలువైన పురావస్తు కనుగొనుళ్లలో ఒకటిగా నిలిచింది.
Poland: గ్రోజిక్ అడవిలో జూన్ నెలలో చరిత్రాభిమానులు డానార్ కాలిష్ అతని బృందం వినోదం కోసం ప్రారంభించిన నిధి వేట ఐదు వారాలకే అద్భుత ఫలితాలను ఇచ్చింది. తొలుత వారు రోమన్ కాలం నాటి పురాతన స్మశానవాటికను కనుగొన్నారు. అక్కడ ఒక యోధుడి అస్థిపంజరం, ఈటె, కవచం భాగాలు దొరికాయి. ఇవి ఆ కాలపు యుద్ధ నైపుణ్యాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి.
Poland: కొద్ది రోజుల తరువాత 11వ శతాబ్దానికి చెందిన ఒక నాణెం, ఒక చిన్న మట్టి కుండ దొరికింది. ఆ కుండను విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి తెరిచినప్పుడు 631 బంగారు నాణేలు బయటపడ్డాయి. తరువాత మరొక మట్టి కుండలో కూడా నాణేలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే అసలు సంచలనం జూలై 12న చోటు చేసుకుంది. బృంద సభ్యుడు మత్యుష మట్టిలో మెరుస్తున్న ఒక వస్తువును గుర్తించాడు. మొదట అది సాధారణ బ్రాస్లెట్గా భావించినా, నిపుణులు పరిశీలించగా అది ఐదవ శతాబ్దానికి చెందిన 222 గ్రాముల బరువున్న స్వచ్ఛమైన బంగారు హారమని తేలింది. హుక్-అండ్-లూప్ డిజైన్లో తయారైన ఈ హారం అద్భుతంగా సురక్షితంగా నిల్వ ఉంది.
పురావస్తు నిపుణుల ప్రకారం, ఈ హారం గోతిక్ సమాజానికి చెందినది. ఆ కాలంలో పోలాండ్లో స్లావిక్ ప్రజలతో పాటు జర్మన్ గోతిక్ సమాజం నివసించేది. స్కాండినేవియాలో ఇలాంటి హారాలు కనుగొనబడ్డా, పోలాండ్లో ఇది మొదటిసారి. ఈ ఆవిష్కరణలు ఆ ప్రాంతపు ప్రాచీన చరిత్రకు కొత్త వెలుగునిస్తున్నాయి.
