Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ కలకలం రేపుతోంది. వరుసగా రౌడీ షీటర్లపై దాడులు జరగడంతో ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే కొంతమంది రౌడీ షీటర్లు దాడుల్లో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రి పడకపై చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాలు పాతబస్తీలోని రౌడీ షీటర్లలో భయాందోళనలు రేపుతున్నాయి.
Hyderabad: తాజాగా రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పురా దర్వాజా వద్ద ఖిజార్ యాకుబీ అనే అనుమానిత రౌడీ షీటర్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఖిజార్ను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాతబస్తీలో మళ్లీ హడావుడి చెలరేగింది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. 51 మంది ఆఫ్రికన్లు అదుపులో
దాడి వెనుక కారణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది పాత కక్ష కారణమా? లేక గ్యాంగ్ వార్ కోణమా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ, నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో పాతబస్తీలో రౌడీ షీటర్లపై వరుస దాడులు జరగడంతో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. వరుస దాడుల కారణంగా రౌడీ షీటర్లు ఎప్పుడెప్పుడు తమపై దాడి జరుగుతుందోనని గజగజలాడుతున్నట్లు తెలుస్తోంది.
