Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్‌తో ప్రజల్లో ఆందోళన!

Weather Report

Rain Alert: తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు మరింత ప్రభావం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వర్షాలు మోస్తరు నుంచి కుండపోతగా కురుస్తుండగా, ఇప్పుడు వాతావరణ శాఖ మరింత కీలక హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో ఇప్పటికే ముసురు వాతావరణం ఏర్పడింది.

Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వర్షాలు తీవ్ర స్థాయిలో కురిసే అవకాశముందని హవామానశాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు పసుపు మరియు రెడ్ అలర్ట్‌లు ప్రకటించారు.

Rain Alert: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 836 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిర్పూర్ (టి) మండలం లోనవెల్లిలో 5.7 సెం.మీ., బెజ్జూరులో 5.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలు లోతట్టు వంతెనలు మునిగిపోయాయి.

ఇప్పటికే ప్రజలు పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమండవకు చెందిన పశువుల కాపరులు మున్నేరులో ఏర్పడిన వరద నీటిలో ఓ లంకలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు పడవల ద్వారా వారిని సురక్షితంగా రక్షించారు.

హవామానశాఖ ప్రకారం ఈ జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది:

  • కామారెడ్డి 
  • మెదక్ 
  • జనగామ 
  • హనుమకొండ 
  • వరంగల్ 
  • ఖమ్మం 
  • భద్రాద్రి కొత్తగూడెం 
  • ములుగు 
  • భూపాలపల్లి 
  • నిజామాబాద్ 
  • నిర్మల్ 
  • మంచిర్యాల 
  • ఆసిఫాబాద్ 
  • ఆదిలాబాద్ 

శనివారం నాటికి ఈ వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తాకే అవకాశముంది. ఆదివారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని, సోమవారం నాడు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన, సీఎంవో అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువులు, కుంటలు నిండే పరిస్థితి నేపథ్యంలో, ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వరుస వర్షాలతో తెలంగాణలో జనజీవనం గందరగోళంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలను పాటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *