జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో, ఎగస్ట్రా లగేజీ విషయంలో ఒక సైనిక అధికారి నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులను కొట్టాడు. ఒక ఉద్యోగి వెన్నెముక విరిగింది. మరొకరి దవడ విరిగింది. మూడవ ఉద్యోగి ముక్కు నుండి రక్తం కారింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు.. నాల్గవ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు, అయినప్పటికీ నిందితుడు అతన్ని తన్నుతూనే ఉన్నట్టు తెలిసింది.
ఈ సంఘటన జూలై 26న జరిగింది. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితుడైన ఆర్మీ అధికారిని విమాన ప్రయాణ నిషేధ జాబితాలో ఉంచినట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటన విడుదల చేసింది. సైన్యం కూడా ఈ విషయాన్ని గుర్తించి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇండియా టుడే వచ్చిన కథనం ప్రకారం, నిందితుడైన అధికారిని లెఫ్టినెంట్ కల్నల్ రితేష్ కుమార్ సింగ్ గా గుర్తించారు. అతను గుల్మార్గ్లోని హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (HAWS)లో పనిచేస్తున్నాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
అసలేం జరిగిందంటే..
జూలై 26న, స్పైస్‌జెట్ విమానం SG-386 శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళుతుండగా. బోర్డింగ్ గేట్ వద్ద, ఆర్మీ అధికారి అని చెప్పబడుతున్న ఒక ప్రయాణికుడు నలుగురు సిబ్బందిపై ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా దాడి చేశాడు.
ఎయిర్‌లైన్ ప్రకారం, నిందితుడు రెండు క్యాబిన్ బ్యాగులను మోసుకెళ్తున్నాడు. వాటి మొత్తం బరువు 16 కిలోలు. ఇది 7 కిలోల పరిమితికి రెట్టింపు. మీ లగేజీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువగా ఉందని స్పైస్‌జెట్ సిబ్బంది ప్రయాణీకుడికి చెప్పారు. అందువల్ల అదనపు పేమెంట్ చేయడం తప్పదని చెప్పారు. అయితే, నిందితుడైన ఆ ఆర్మీ అధికారి అదనపు డబ్బు చెల్లించడానికి నిరాకరించాడు. దీని తరువాత, అతను బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయకుండా బలవంతంగా ఏరోబ్రిడ్జిలోకి ప్రవేశించాడు. ఇది భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘన.
ఈ సమయంలో స్పైస్ జెట్ సిబ్బంది నిందితులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతను వారిని కొట్టడం ప్రారంభించాడు. సమీపంలో ఉంచిన స్టాండ్‌తో సిబ్బందిపై దాడి చేశాడు. వారిని తన్ని, కొట్టాడు. వారిలో కొందరికి దవడ గాయాలు కూడా అయ్యాయి. స్పైస్‌జెట్ ఉద్యోగి ఒకరు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు, కానీ ఆ ప్రయాణీకుడు స్పృహ కోల్పోయిన ఉద్యోగిని తన్నుతూనే ఉన్నాడు. స్పృహ కోల్పోయిన ఉద్యోగికి సహాయం చేయడానికి వంగుతుండగా, మరొక ఉద్యోగి దవడపై బలంగా తన్నడంతో అతని ముక్కు, నోటి నుండి రక్తస్రావం ప్రారంభమైంది. గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రిలో చేర్చారు.
నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. పౌర విమానయాన నిబంధనల ప్రకారం, ఆ ప్రయాణీకుడిని నో-ఫ్లై జాబితాలో ఉంచారు. స్పైస్ జెట్ తన ఉద్యోగులపై జరిగిన ప్రాణాంతక దాడి గురించి తెలియజేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రయాణీకుడిపై తగిన చర్య తీసుకోవాలని కోరింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విమానాశ్రయ అధికారుల నుండి పోలీసులకు అందజేసింది.
