Farmer Success Story: భారతదేశంలో వ్యవసాయం అంటే చాలా మంది రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులకే పరిమితం అవుతున్నారు. కానీ కొందరు మాత్రం ఆలోచనల్లో, ఆచరణలో మార్పులు తెచ్చి రైతు వృత్తిని లాభదాయకంగా మలుస్తున్నారు. అలా తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువకుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన హిరోద్ పటేల్. నేలపై కాకుండా చెరువుపై కూరగాయలను పండిస్తూ, రైతు వృత్తి దండగ కాదని.. పండగ అని నిరూపిస్తున్నాడు.
Farmer Success Story: హిరోద్ పటేల్ మొదట్లో తన తండ్రి శివశంకర్‌తో పాటు వరి సాగు మాత్రమే చేసేవాడు. రోజంతా కష్టపడి, చాలా తక్కువ రాబడితో సతమతమవుతున్న తండ్రి పరిస్థితి చూసి, “ఏదో కొత్త పద్ధతిలో చేస్తేనే వ్యవసాయం మనుగడ సాగిస్తుంది” అని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి అతని దృష్టి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వైపు మళ్లింది.
తన 10 ఎకరాల పొలంలో వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టు సాయంతో నాలుగు చెరువులను తవ్వించాడు. వాటిలో చేపల పెంపకం మొదలు పెట్టాడు. అంతేకాదు చెరువుల చుట్టూ గట్లపై అరటి, జామ, కొబ్బరి వంటి చెట్లను నాటాడు. ఒకేసారి చేపల పెంపకం + ఉద్యానవనం సాగుతో లాభాలను పెంచే దిశగా అడుగులు వేశాడు.
హిరోద్ అసలైన వినూత్న ఆలోచన ఏమిటంటే.. చెరువుపై ట్రెల్లిస్ (తీగల పందిరి) నిర్మించి, సొరకాయ, కాకరకాయ, బీరకాయ వంటి కూరగాయలను పెంచడం. నీటిపై తీగలు పాకేలా చేయడం వలన మొక్కలకు ప్రత్యేకంగా నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. తెగుళ్లు తగ్గుతాయి. గాలి, సూర్యకాంతి సమృద్ధిగా అందుతాయి. పైగా కాయలను కోయడం కూడా సులభం.
అతని సృజనాత్మక పద్ధతిలో గత సంవత్సరం సెప్టెంబర్‌లో 1,800 సొరకాయలు పండించి, అదనంగా ₹35,000 ఆదాయం పొందాడు. ఇక చేపల పెంపకం, ఇతర కూరగాయల సాగుతో కలిపి సంవత్సరానికి ₹8-10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు.
హిరోద్ వృత్తిరీత్యా ఒక ఎలక్ట్రీషియన్. తన టాలెంట్‌ని వ్యవసాయంలోనూ ఉపయోగించాడు. చెరువుపై పండే కూరగాయలను కోయడం కోసం ఒక చిన్న పడవను కూడా తయారు చేసుకున్నాడు. పడవలో వెళ్ళి కూరగాయలను సులభంగా కోయగలుగుతున్నాడు.
ఇప్పుడు హిరోద్ పటేల్ వ్యవసాయం ఒక ప్రయోగశాలగా మారింది. ప్రతిరోజూ సుందర్‌గఢ్ జిల్లాలోని అతని గ్రామానికి ఇతర రైతులు వెళ్లి అతని పద్ధతిని నేర్చుకుంటున్నారు. వ్యవసాయం లాభదాయకం కావచ్చని, సృజనాత్మక ఆలోచనలతో రైతులు కొత్త దారులు వెతుక్కోవచ్చని అతను నిరూపిస్తున్నాడు.
హిరోద్ పటేల్ కథ ఏమి చెబుతోంది?
- రైతు వృత్తి కష్టమే కానీ వినూత్నత ఉంటే లాభం ఖాయం.
- ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ (చేపలు + కూరగాయలు + ఉద్యానవనం) ద్వారా భూమిని, వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు.
- చెరువుపై సాగు ఒక కొత్త దిశలో ఆలోచించే విధానం.
రైతు వృత్తి అంటే దండగ కాదు, సరైన ప్రణాళిక, కొత్త ఆలోచనలు ఉంటే అది లాభదాయక పండగ అని ఒడిశా యువ రైతు హిరోద్ పటేల్ తన సక్సెస్ స్టోరీతో నిరూపించాడు.
