Rakhi 2025: ఆపరేషన్ సిందూర్ వీరులకు.. రక్షాబంధన్ కృతజ్ఞతా వేడుకలు 

rakhi 2025 celebrations at kranti park royal

Rakhi 2025: పండగ అంటే కుటుంబం అంతా సంతోషంగా జరుపుకునేది. ఒక్కో పండగ సామాజికంగా ఆయా ప్రాంతాల ప్రజలంతా కలిసి జరుపుకునే వేడుకగా కూడా ఉంటుంది. రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా.. సోదర ప్రేమకు రక్షగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకుంటారు. సోదరునికి రక్ష కట్టి మన సంబంధం ఎప్పుడూ ఒకరికి ఒకరికి రక్షగా నిలవాలని కోరుకుంటారు సోదరీమణులు. మరి దేశానికి రక్షగా నిలబడే వీర జవాన్లకు అలా మాకు అండగా మీరున్నారు.. మీకు.. మీ కుటుంబాలకు తోడుగా మేమున్నాం అని చెప్పాలంటే ఏమి చేయాలి? ఇదిగో.. ఈ ప్రశ్నకు సమాధానంగానే ఈ రాఖీ పండుగ వేడుకలను మన ఆపరేషన్ సిందూర్ వీరులకు రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా రాఖీ కట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు సికిందరాబాద్ సైనిక్ పురి వద్ద ఉన్న క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్. 

Rakhi 2025: క్రాంతి పార్క్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న మేజర్ రాజ్ పాల్ ఆయన సహచర ఆర్మీ అధికారులకు ఈ వేడుకలో రాఖీలు కట్టి క్రాంతి పార్క్ రాయల్ నివాస సోదరీమణులు తమ ప్రేమను చాటుకున్నారు. త్రివేణి స్కూల్ అల్వాల్ బ్రాంచ్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఆపరేషన్ సిందూర్ వీరులకు వీరతిలకం దిద్ది.. రక్షా బంధన్ కావించారు. దేశం కోసం మీరుంటే.. మీకోసం మేమున్నామంటూ క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్, త్రివేణి విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. రక్షాబంధన్ సాక్షిగా మువ్వన్నెల జెండాను మేజర్ రాజ్ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు, క్రాంతి పార్క్ రాయల్ నివాసితులు వీరజవాన్లకు జైహింద్ నినాదాలతో.. వందేమాతర గీతంతో రాఖీ వేడుకలు అద్భుత రీతిలో జరిపారు. 

Rakhi 2025: నేటి తరానికి దేశభక్తిని ప్రోదిచేసి అందించే ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్ కు శుభాకాంక్షలు అందించారు మేజర్ రాజ్ ప్రసాద్. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ఆయన అన్నారు. మన దేశం శత్రు దుర్భేద్యమైనదని చెప్పిన మేజర్ రాజ్ ప్రసాద్ పౌరులంతా సైనిక సోదరులకు అండగా ఉన్నారన్న భావనే తమకు అత్యంత ఉత్సాహమిస్తుందని చెప్పారు. రాఖీ పండుగకు సైనిక సోదరులకు రక్షా బంధనం కావించడం తమలాంటి సైనికులను మానసికంగా మరింత శక్తివంతంగా చేస్తుందని అన్నారు. యువత బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మేజర్ రాజ్ ప్రసాద్ తో పాటు నాయక్ సుబేదార్ బి . సిద్దరాములు ఇతర సైనిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు .  

Rakhi 2025: ఈ సందర్భంగా క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీ జగపతి వర్మ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ మన దేశ సైనిక శక్తిని ప్రపంచానికి తేటతెల్లం చేసిందన్నారు. మన దేశం అంటే చిన్న చూపు చూసిన చాలా దేశాలు ఆపరేషన్ సిందూర్ తరువాత మన సైనిక శక్తికి తమ తలలు వంచి నమస్కరిస్తున్నాయన్నారు. అజాత శత్రువుగా.. శాంతి మార్గంలో నడిచే భారతదేశానికి తమను చిన్న చూపు చూసినా.. తమ పైకి తప్పుడు దారిలో ఎవరు దాడికి ప్రయత్నించినా వాళ్లకు తిరుగులేని సమాధానం చెప్పగలం అని ఆపరేషన్ సిందూర్ తో మన సైనికులు గట్టిగా చెప్పారన్నారు. రక్షా బంధన్ సందర్భంగా క్రాంతి పార్క్ రాయల్ రెసిడెంట్స్ అందరూ సైనిక సోదరులకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించామని చెప్పారు. త్రివేణి స్కూల్ అల్వాల్ నుంచి విద్యార్థులు కూడా వచ్చి తమతో కలిసి సైనిక సోదరులకు రాఖీలు కట్టడం ద్వారా దేశ సరిహద్దుల్లో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వారికి కృతఙ్ఞతలు తెలుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదములు తెలిపారు. 

అనంతరం ఆపరేషన్ సిందూర్ అదేవిధంగా భారత సైనిక విజయాలను చూపిస్తూ విద్యార్థులకు ఆర్మ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 

క్రాంతి పార్క్ రెసిడెంట్స్ తరఫున రామ్మోహన్, టి. రాంబాబు, వి.రవికుమార్, త్రివేణి స్కూల్ నుంచి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *