Chiranjeevi Fans: ఏపీ అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 25) నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బాలయ్య మాటలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి ప్రకటన విడుదల చేశారు. ఇక మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Chiranjeevi Fans: అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత శుక్రవారం (సెప్టెంబర్ 25) ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, “మెగాస్టార్ చిరంజీవి గారిని వ్యంగంగా ఉద్దేశించి మాట్లాడిన బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా అనేక సార్లు మెగా కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఆయన, ఇప్పుడు చట్టసభలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదు” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IND Vs AUS U19: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు
అభిమానులు గుర్తు చేసిన అంశాల్లో, “బాలకృష్ణ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మెగా కుటుంబమే అండగా నిలిచింది. అధికారంలోకి రావడంలో కూడా కీలక పాత్ర పోషించింది. కానీ నేడు అదే కుటుంబం ప్రతిష్టను దిగజార్చేలా బాలయ్య ప్రవర్తించడం తగదు” అని పేర్కొన్నారు.
అలాగే, “ఈ వ్యాఖ్యలు చిరంజీవి గారిని కూడా తీవ్రంగా బాధించాయి. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే, మెగా అభిమానుల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు” అని హెచ్చరించారు.
చివరిగా అభిమాన సంఘం స్పష్టం చేసింది: “బాలకృష్ణ వెంటనే స్పందించి బహిరంగ క్షమాపణలు తెలపాలి. లేనిపక్షంలో ఆయనకు ప్రజాక్షేత్రంలోనే తీవ్ర నిరసనలు తప్పవు” అని అఖిల భారత చిరంజీవి యువత తమ ప్రకటనలో పేర్కొంది.
