MLA Raja Singh: తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలని భావిస్తున్న నేతలకు ఆయన హెచ్చరిక జారీ చేశారు. “బీజేపీలో చేరేముందు రెండు సార్లు ఆలోచించండి. చేరిన తర్వాత కార్యకర్తలకు పదవులు, మీకు టికెట్ గ్యారెంటీ ఉండదు” అని స్పష్టం చేశారు.
MLA Raja Singh: బీజేపీలో చేరిన తర్వాత స్థానికంగా కోరుకున్న మార్పులు జరగవని, మొదట ప్రాధాన్యం ఉన్నా తర్వాత అంచుల్లో పడే అవకాశం ఉంటుందని అన్నారు. “కార్యకర్తలకు పదవులు ఇప్పించుకోలేరు, మీరు కూడా పార్టీ నిర్ణయాలకు లోబడే ఉండాలి. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని బాధలు భరించే శక్తి పెంచుకోవాలి” అని సూచించారు.
ఇది కూడా చదవండి: Pulivendula ZPTC Election: పులివెందులలో హై టెన్షన్, ముందస్తు అరెస్టులతో ఉత్కంఠ
MLA Raja Singh: తాను అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నానని, గోషామహల్ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిపించిన కార్యకర్తల కోసం కూడా ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో తెలుసుకోవడానికి విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలతో మాట్లాడాలని సలహా ఇచ్చారు.
హిందూత్వం, దేశం, సమాజం కోసం బీజేపీ మంచి పనులు చేస్తున్నప్పటికీ, తెలంగాణలో కొందరి “మా అబ్బా పార్టీ” ధోరణి వల్ల పార్టీ దెబ్బతింటోందని ఆరోపించారు. అయినా కార్యకర్తల ఆశీస్సులతో భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి బీజేపీ నుంచే అవుతారని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
