Dharmasthala: కర్నాటకలోని ధర్మస్థలలో జరుగుతున్న సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు 6, 11 నెంబర్ సైట్లలో అస్థిపంజర అవశేషాలు బయటపడగా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన 13వ సైట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఒకేసారి 8 మృతదేహాలను ఖననం చేశానని అప్పటి పారిశుధ్య కార్మికుడు భీమా వాంగ్మూలం ఇవ్వడంతో, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అత్యాధునిక జీపీఆర్ (గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్) టెక్నాలజీని వినియోగిస్తోంది.
Dharmasthala: జీపీఆర్ ద్వారా భూమిలోకి సిగ్నల్స్ పంపి, సెన్సర్లతో వచ్చిన డేటాను రికార్డ్ చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా 2డీ, 3డీ ఇమేజింగ్ రూపొందించి భూమిలోపలున్న అవశేషాలపై అంచనాలు వేయనున్నారు. నదీపరివాహక ప్రాంతంలో భూమిలో ఖననం చేసిన ఏ వస్తువైనా ఈ పద్ధతిలో గుర్తించవచ్చు. ప్రస్తుతం రత్నగిరి బెట్ట బాహుబలి విగ్రహానికి 200 మీటర్ల దూరంలో, వర్షంలోనే తవ్వకాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ..? ట్రంప్తో కీలక చర్చల ముహూర్తం
దర్యాప్తు సమయంలో SIT, రత్నగిరి బెట్ట సమీపంలో ఎక్కడినుంచో తెచ్చి కొత్త మట్టి పోసినట్లు గుర్తించింది. ఈ చర్యపై అనుమానం వ్యక్తం చేస్తూ తహశీల్దార్కు నోటీసులు ఇచ్చింది. కానీ మట్టి పోసిన విషయం తమకు తెలియదని అధికారులు సమాధానమిచ్చారు. ఈ దర్యాప్తుతో ధర్మస్థల పరిసరాల్లో ఆత్మీయులు అదృశ్యమైన కుటుంబాల్లో ఉత్కంఠ నెలకొంది. కనీసం ఆనవాళ్లయినా దొరుకుతాయనే చిన్న ఆశ వారిలో ఉంది. 38 ఏళ్ల క్రితం ఓ విద్యార్థిని హత్య కేసుపై పునర్విచారణ కోరుతూ ఆమె సోదరి SITను ఆశ్రయించింది.
Dharmasthala: గత జూన్ 3న, 1995 నుంచి 2014 మధ్య వందలాది మహిళలు, విద్యార్థినుల మృతదేహాలను ఖననం చేశానని ఆరోపిస్తూ, అప్పట్లో శానిటేషన్ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని సమాచారంతో ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరగ్గా, రెండు ప్రదేశాల్లో అవశేషాలు దొరికాయి.
దర్యాప్తు కొనసాగుతున్న వేళ జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు ధర్మస్థలలోకి చేరుకుని SIT నుండి వివరాలు సేకరించారు. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగాలని సూచనలు చేశారు. ఇదే సమయంలో, సామూహిక హత్యల ఆరోపణలు అబద్ధమని చెబుతున్న గౌరిబిదనూర్ బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, ఆగస్టు 16న యెలహంక నుండి ధర్మస్థల వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
