America Tariffs: భారతదేశం-చైనా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అమెరికాను ఆందోళనకు గురి చేసింది. దీనితో అమెరికా తన వైఖరిని కఠినతరం చేస్తూ, భారత్పై అధిక సుంకాలను విధించే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారికంగా స్పష్టం చేసింది.
America Tariffs: ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే భారతదేశంపై సుంకాలను పెంచినట్లు వెల్లడించారు. మొదట 25 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్, తరువాత దానిని 50 శాతం వరకు పెంచారని ఆమె స్పష్టం చేశారు.
అసలు ఉద్దేశం రష్యాపై ఒత్తిడి పెంచడం, యుద్ధాన్ని త్వరగా ముగించడమేనని అమెరికా చెబుతోంది. విలేకరుల సమావేశంలో కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, “ఈ యుద్ధాన్ని ఆపడానికి అధ్యక్షుడు ట్రంప్ బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రపంచ దేశాలను కూడా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు” అని అన్నారు.
ఇటీవల ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కావడంతో పాటు, యూరోపియన్ నాయకులతో కూడా చర్చలు జరిపారు. నాటో సెక్రటరీ జనరల్తో సహా పలువురు యూరోపియన్ నేతలు కూడా యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద ముందడుగు అని వైట్ హౌస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
