Lady Don Aruna: నెల్లూరులో చర్చనీయాంశంగా మారిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్‌కు సహకరిస్తూ నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదుల ఆధారంగా కోవూరు పోలీసులు అరుణను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Lady Don Aruna: ఇటీవల నెట్టింట వైరల్ అయిన వీడియోలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో అరుణ కలసి హల్చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏకంగా ఇద్దరూ సరసాలు ఆడుకుంటూ కనిపించడంతో ప్రజల దృష్టి ఆకర్షించాయి. దీంతో పోలీసులు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అరుణపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఓ సీఐకి ఫోన్ చేసి హోంశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు బెదిరించడం, అద్దె ఇంటి డబ్బులు చెల్లించకుండా లాక్కునే ప్రయత్నం చేయడం, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరు కానిస్టేబుళ్లు తనను ఇరికించడానికి కారు ఆపి గంజాయి పెట్టాలని చూశారని అరుణ ఆరోపిస్తోంది. అయితే, తాను నిర్దోషినేనని ఆమె వాదిస్తోంది.
శ్రీకాంత్ గతంలో ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2010 నుంచి నెల్లూరు జైలులో ఉన్న అతను, 2014లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. 2018లో మళ్లీ పోలీసులకు చిక్కడంతో తిరిగి జైల్లోకి వెళ్లాడు. కానీ జైల్లో ఉన్నప్పటికీ తన గ్యాంగ్‌ను బయట నుంచి నడిపిస్తూ దందాలు కొనసాగించాడని ఆరోపణలు ఉన్నాయి.
అరుణ, శ్రీకాంత్ ఆస్పత్రిలో కలిసిన వీడియోలతో ఈ వ్యవహారం మరింత సెన్సేషన్‌గా మారింది. ఆమెకు ఉన్నతాధికారుల సహకారం కూడా ఉన్నట్లు సమాచారం వెలువడుతోంది.
