Asia Cup 2025: ఆసియా కప్ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, సెలెక్టర్లు తీసుకున్న ఒక కీలక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జట్టులో ఒక డేంజరస్ మిడిలార్డర్ ప్లేయర్‌కు చోటు దక్కకపోవడంతో భారత్ టైటిల్ ఆశలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. అయితే, స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఈ జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున 600 కంటే ఎక్కువ పరుగులు 175.07 స్ట్రైక్ రేట్‌తో నమోదు చేసిన అయ్యర్, అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పటికీ జట్టులో స్థానం దక్కలేదు. IPL చరిత్రలో ఒక సీజన్లో 600 పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా (క్రిస్ గేల్, సూర్యకుమార్ తర్వాత) అయ్యర్ నిలిచాడు.
ఇది కూడా చదవండి: Sudharshan Reddy: పాలిటిక్స్ పాలిటిక్సేరా మావా.. సుదర్శన్ రెడ్డికి డీఎంకే మద్దతు
అయ్యర్ దేశవాళీ క్రికెట్లోనూ, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ వరుస విజయాలు సాధించాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను దశాబ్దం తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిపించగా, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై విజయానికి కూడా అతను ప్రధాన కారణమయ్యాడు. అదనంగా ముంబై ఫాల్కన్స్‌ను T20 లీగ్ ఫైనల్‌కు నడిపించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
జట్టులో యశస్వి జైస్వాల్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, “యశస్వికి ఇది నిజంగా దురదృష్టకరం. కానీ అభిషేక్ శర్మ బాగా రాణిస్తున్నాడు. అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సిందే. శ్రేయాస్ విషయమూ అలాంటిదే. అతను ఎవరి స్థానాన్ని తీసుకోగలడు? అది అతని తప్పు కాదు. కానీ మాది కూడా కాదు” అని పేర్కొన్నారు.
అయ్యర్ చివరిసారిగా 2023 డిసెంబర్లో ఇంగ్లాండ్‌పై T20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే, ఈ సారి కూడా ఎంపికలో చోటు దక్కకపోవడం, అతని ఫామ్ దృష్ట్యా పెద్ద తప్పిదంగా మారిందనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
