Broccoli Effects: బ్రోకలీని సాధారణంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ కూరగాయను రోజువారీ ఆహారంలో చేర్చమని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ అందరికీ ఇది ప్రయోజనకరం కాదు. కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బ్రోకలీని తినకపోవడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హైపోథైరాయిడిజం ఉన్నవారికి హానికరం
Broccoli Effects: థైరాయిడ్ సమస్యలు (హైపోథైరాయిడిజం) ఉన్నవారు బ్రోకలీ తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న గాయిట్రోజెన్లు థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు అసమతుల్యం కావచ్చు.
జీర్ణ సమస్యలను పెంచే అవకాశం
జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారికి కూడా బ్రోకలీ అనుకూలం కాదు. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని మితంగా లేదా పూర్తిగా మానేయడం మంచిది.
మూత్రపిండ సమస్యల వారికి మంచిది కాదు
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బ్రోకలీ తినకూడదు. ఇందులో ఉండే ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. అదనంగా కొంతమందికి బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఈ కుటుంబానికి చెందిన కూరగాయలపై అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి దురద, వాపు, శ్వాస ఇబ్బందులకు దారితీస్తాయి.
గర్భిణీలు జాగ్రత్త
గర్భిణీలు బ్రోకలీని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గర్భిణీకి అసౌకర్యం కలిగించే ప్రమాదం ఉంది.
మొత్తానికి, బ్రోకలీ ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ, థైరాయిడ్, జీర్ణ సమస్యలు, మూత్రపిండ సమస్యలు ఉన్నవారు మరియు గర్భిణీలు దీన్ని తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
