Elderly Couple: ఉత్తరాఖండ్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అడవిలో పుట్టగొడుగులు సేకరించి వండి తిన్న ఓ వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పౌరీ జిల్లా శ్రీకోట్ గ్రామంలో చోటు చేసుకుని ప్రాంతంలో కలకలం రేపింది.
విషపూరిత పుట్టగొడుగుల వల్ల విషాదం
Elderly Couple: పౌరి గర్హ్వాల్కు చెందిన మహావీర్ సింగ్ (70), ఆయన భార్య సరోజినీ దేవి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు 12న మహావీర్ సింగ్ అడవిలో నుంచి పుట్టగొడుగులు సేకరించి ఇంటికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి వీరు వాటిని వండుకుని తిన్నారు. కానీ భోజనం చేసిన కొంతసేపటికే దంపతుల ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.
ఆస్పత్రికి తరలించేలోపు మరణం
స్థానికులు వారిని గమనించి తక్షణమే అల్మోరా ఆసుపత్రికి తరలించారు. అయితే పుట్టగొడుగులు తీవ్రంగా విషపూరితం కావడంతో పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సరోజినీ దేవి మార్గం మధ్యలోనే మృతి చెందారు. అనంతరం మహావీర్ సింగ్ను డెహ్రాడూన్లోని మహంత్ ఇంద్రేష్ ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 14న ప్రాణాలు కోల్పోయారు.
నిపుణుల హెచ్చరిక
అడవుల్లో, పొలాల్లో, తడి ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవిగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, కిడ్నీ మరియు లివర్ ఫెయిల్యూర్కు దారి తీస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. అందువల్ల అడవిలో సేకరించిన పుట్టగొడుగులు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
