Russia: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శనివారం రాత్రి డ్రోన్, క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడులలో ప్రభుత్వ భవనాలు, నివాస ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి. తాజా దాడుల్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు.
Russia: కీవ్‌లోని మంత్రుల మండలి భవనంపై నేరుగా క్షిపణులు ప్రయోగించడంతో పైకప్పు నుండి మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. ఈ భవనంలో మంత్రుల ఇళ్లు, కార్యాలయాలు రెండూ ఉండటంతో కలకలం రేగింది. అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
డ్రోన్ దాడులతో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ను రష్యా వరుస క్షిపణులతో కొనసాగించిందని కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. గత రెండు వారాల్లో కీవ్‌పై జరిగిన రెండవ అతిపెద్ద దాడి ఇదని ఆయన అన్నారు. ఇప్పుడు రష్యా ప్రభుత్వ భవనాలపై నేరుగా దాడి చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Adani Power: భూటాన్‌లో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు.. అదానీ పవర్ సంస్థ కీలక ఒప్పందం
క్రెమెన్‌చుక్ నగరంలో డజన్లకొద్దీ పేలుళ్లు జరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని మేయర్ విటాలీ మాలెట్‌స్కీ తెలిపారు. క్రివి రిహ్‌లో రవాణా, మౌలిక వసతులు దెబ్బతిన్నాయని స్థానిక సైనిక అధికారి ఒలెక్సాండర్ విల్కుల్ పేర్కొన్నారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో కూడా నివాస భవనాలు నష్టపోయాయి.
ఈ దాడుల నేపథ్యంలో పోలాండ్ తన సైనిక విమానాలను సిద్ధం చేసింది. “పశ్చిమ ఉక్రెయిన్‌పై వైమానిక దాడుల ముప్పు ఉన్నందున వాయు భద్రతను నిర్ధారించడానికి మేము తగిన చర్యలు తీసుకున్నాం” అని పోలిష్ సాయుధ దళాలు వెల్లడించాయి.
ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నా, యుద్ధంలో వేలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
