Chitfund Scam: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చీటీల పేరిట భారీ మోసం వెలుగుచూసింది. దాదాపు రూ.40 కోట్లతో చీటీల వ్యాపారి పరారైన ఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. దశాబ్దాలుగా నమ్మకాన్ని పెంచుకున్న ఈ వ్యాపారి ఒక్కసారిగా జంప్ ఇవ్వడంతో వందలాది కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి.
Chitfund Scam: ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన చింతలపూడి వీర శంకరరావు మూడు దశాబ్దాల క్రితం చిన్న చిన్న చీటీలతో వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా వ్యాపారులు, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఐదు లక్షల నుంచి కోటి రూపాయల చీటీలను నడపడం మొదలుపెట్టాడు. స్నేహంగా, విశ్వాసం కలిగించే ధోరణితో ప్రజల్లో నమ్మకం తెచ్చుకున్నాడు.
ఇది కూడా చదవండి: Crime News: నెలన్నర పసికందుతో ఇద్దరు పిల్లలను హతమార్చిన తల్లి తరువాత ఆత్మహత్య!
కాలపరిమితి ముగిసిన వారికి డబ్బు తిరిగి ఇవ్వకుండా, వడ్డీతో సహా బకాయిలు చెల్లించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు గత నెల 28న భార్య, పిల్లలతో కలిసి పరారైనట్లు తెలిసింది. ఇంటికి వెళ్లిన బాధితులకు తాళం వేసి ఉండటమే కాకుండా, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి.
ఈ చీటీల్లో ఎక్కువగా పాల్గొన్నవారు రోజువారీ కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు. “రోజు కష్టం చేసి రూపాయి రూపాయి పోగుచేసి కట్టిన చీటీలతో మోసం చేశారు” అంటూ బాధితులు వాపోతున్నారు.
నష్టపోయిన వారు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనతో మొత్తం ప్రాంతంలో కలకలం రేగింది.
