Telangana: పాపం గర్భిణి కడుపులో ఉన్నది అమ్మాయి అని తేలింది.. ఆర్ఎంపీ అరాచకం!

Telangana: తెలంగాణలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, గుట్టుగా అబార్షన్లు మరోసారి బహిర్గతమయ్యాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్లకు చెందిన విజేత అనే గర్భిణి, ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి బలి అయింది.

Telangana: విజేత, వెంకన్న దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల మళ్లీ గర్భం దాల్చిన విజేతను కుటుంబ సభ్యులు తుంగతుర్తిలోని శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ వైద్యుడు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించాడు. పరీక్షలో గర్భంలో ఆడ శిశువుందని తేలడంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడితో గర్భస్రావం చేయాలని నిర్ణయించారు.

శ్రీనివాస్ తన హాస్పిటల్‌లోనే అబార్షన్ జరిపాడు. అయితే శస్త్రచికిత్సలో తప్పిదం జరిగి విజేతకు అధిక రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు చికిత్స నిరాకరించడంతో చివరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో విజేత మృతి చెందింది.

ఇది కూడా చదవండి: AP Minor Girl: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన పదో తరగతి బాలిక!

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. మృతురాలి బంధువులు తుంగతుర్తిలోని శ్రీనివాస్ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. మరోవైపు, ఘటన అనంతరం శ్రీనివాస్ పరారయ్యాడు.

గర్భిణీ విజేత మృతిపై టెలంగాణ మెడికల్ కౌన్సిల్ సుమోటో విచారణ ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌కి తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే, జిల్లాలో అర్హత లేని వైద్యులు అక్రమంగా ఆసుపత్రులు నడుపుతూ వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ ఘటనతో లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు ఎంతవరకు కొనసాగుతున్నాయో మరోసారి బహిర్గతమైంది. ఒక గర్భిణి ప్రాణం కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *