Crime News: ఆంధ్రప్రదేశ్లో కాల్ మనీ మాఫియా మరోసారి అమాయక కుటుంబాన్ని బలితీసుకుంది. యాభై వేల రుణానికి పదిహేను లక్షల రూపాయలు చెల్లించినా కేటుగాళ్ల దురాశ చావలేదు. ఇంకా వడ్డీ కట్టాలని ఒత్తిడి చేస్తూ మహిళపై తీవ్రంగా వేధింపులకు దిగారు. చివరికి అవమానాన్ని తట్టుకోలేక ఆ మహిళ ఎలుకల మందు తాగి ప్రాణాలు తీసుకుంది.
Crime News: తాడేపల్లి నులకపేటకు చెందిన జయక్రిష్ణ పురోహితుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. అతని భార్య క్రిష్ణవేణి 2016లో విజయవాడకు చెందిన దుక్కా శ్రీను, వేణు, ప్రసాద్ల వద్ద యాభై వేల రూపాయలు వడ్డీకి తీసుకుంది. అప్పటి నుండి ఇప్పటివరకు పదిహేను లక్షల రూపాయలు చెల్లించారు. అయినా ఇంకా వడ్డీ వస్తుందని ఆ కేటుగాళ్లు వేధింపులు పెంచారు. భర్త పనిచేస్తున్న పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి అందరి ముందు అవమానకరంగా మాట్లాడారు.
ఈ అవమానం తట్టుకోలేక క్రిష్ణవేణి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆవేదనతో ఈ నెల 14న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు ఆమె సెల్ఫీ వీడియో తీసి, తాను ఎదుర్కొన్న వేధింపులు, కాల్ మనీ మాఫియాల పేర్లను రికార్డ్ చేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె మృతి చెందింది.
సెల్ఫీ వీడియో ఆధారంగా జయక్రిష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దుక్కా వేణు, శ్రీను, ప్రసాద్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
